మరో పరీక్ష తప్పదా?
♦ ఎడపాడి ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో పిటిషన్
♦ మరోసారి విశ్వాస పరీక్ష పెట్టాలని పన్నీర్ వినతి
♦ స్వీకరించిన ద్విసభ్య ధర్మాసనం
♦ 11వ తేదీన విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీఎం ఎడపాడి ప్రభుత్వానికి మరో విశ్వాస పరీక్ష పెట్టాలని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీర్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించగా ఎడపాడి ప్రభుత్వం మరో పరీక్షకు సిద్ధంకా క తప్పదా అనే చర్చ మొదలైంది. ఎడపాడిపై పన్నీర్ సెల్వం మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ఫిబ్రవరిలో జరిగిన బల పరీక్ష చెల్లదని, మరోసారి విశ్వాసపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే అల్లకల్లోలంగా మారిపోగా పార్టీ, ప్రభుత్వంపై శశికళ ఆధిపత్యం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ప్రభుత్వ, పార్టీ బాధ్యతలు చేపట్టారు. అయితే సీఎం సీటుపై కన్నేసిన శశికళ పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయడంతో పార్టీలో ముసలం పుట్టింది. శశికళపై పన్నీర్‌సెల్వం తిరుగుబాటుచేసి పార్టీని చీల్చారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ సీఎం అయ్యేలోగా ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తన స్థానంలో ఎడపాడిని శాసనసభాపక్ష నేతగా ఎన్నికచేసి ఆమె జైలుకెళ్లారు. సీఎం పీఠంపై పన్నీర్‌సెల్వం పోటీపెంచగా చెన్నై శివార్లు కూవత్తూరులోని ఫాంహౌస్‌లో క్యాంపు రాజకీయాల తరువాత గవర్నర్ ఆదేశాల మేరకు ఎడపాడి సీఎం అయ్యారు.
అయితే పార్టీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి మద్దతు కూడగట్టుకున్నారనే ఆరోపణలతో గవర్నర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18వ తేదీన ఎడపాడి విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎంతో ఉత్కంఠ నడుమ 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎడపాడి నెగ్గారు. అయితే ఆనాటి విశ్వాసపరీక్ష తీరును పన్నీర్‌సెల్వం, ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. పన్నీర్ వర్గం నేతలు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఏఎమ్ కన్నివిలగర్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పన్నీర్ సెల్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రమణియన్, సునీల్ ఫెర్నాండజ్ వాదించారు.
ఎమ్మెల్యేలను కూవత్తూరు ఫాంహౌస్‌లో ఉంచి బెదిరింపులకు గురిచేయడంతో ఎడపాడి విశ్వాస పరీక్షలో రహస్య ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని ఒత్తిడి చేశామని న్యాయవాదులు తెలిపారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన స్పీకర్ ధనపాల్.. ఎడపాడి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారని అన్నారు. ఏకపక్షంగా సాగిన ఆనాటి విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించాలని, రహస్య ఓటింగ్ విధానంతో మరోసారి నిర్వహించేలా ఆదేశించాలని న్యాయవాదులు కోరారు. పన్నీర్ సెల్వం వర్గం న్యాయవాదుల వాదన విన్న తరువాత సదరు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. ఈనెల 11వ తేదీకి వాయిదావేసి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీం కోర్టు నుంచి సానుకూల పవనాలు వీచడంతో పన్నీర్‌సెల్వం గురువారం తన అనుచర ఎమ్మెల్యేలతో, ఇతర నేతలతో సమావేశమయ్యారు.
బలహీనమైన నాటి బలం:
ఎడపాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కొన్న నాటికి నేటికీ పార్టీలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అన్నాడీఎంకేలో శశికళ, పన్నీర్ వర్గాలు మాత్రమే ప్రత్యర్థులుగా నిలవగా కొత్తగా శశికళ వర్గం నుంచి ఎడపాడి, దినకరన్, ప్రభాకరన్ వర్గాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటులో శశికళ వైపుండిన 122 మందిలో కొందరు దినకరన్, ప్రభాకరన్ వైపు వెళ్లిపోయి ఎడపాడిని వ్యతిరేకిస్తున్నారు. ఇక పన్నీర్‌సెల్వం వర్గం ఎలానూ ఉంది. అసెంబ్లీలో ఎడపాడి బలం తగ్గిపోయిన స్థితిలో మరోసారి విశ్వాసపరీక్షకు ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశిస్తే, ఎడపాడి ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితులు ఊహించడం కష్టం. వెయిట్ అండ్ సీ.