తమిళసినిమా: ప్రజా నటుడు ఎంజీఆర్ జీవిత చరిత్ర జగమెరిగినదే. ఆయన నటన, రాజకీయ జీవితం తెరచిన పుస్తకమే. ఇప్పటికే ఇరువర్ చిత్రంలో దర్శకుడు మణిరత్నం ఎంజీఆర్ జీవితంలోని ఒక కోణాన్ని తెరపై ఆవిష్కరించారు. అయితే సగటు మనిషి చేత మక్కల్ తిలకం బిరుదాంకితుడైన ఎంజీఆర్ జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇంతకు ముందు కామరాజ్ ది కింగ్‌మేకర్, ముదల్వర్ మహాత్మ చిత్రాలను నిర్మించిన రమణ కమ్యునికేషన్ సంస్థ అధినేత ఏ.బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఎంజీఆర్ బాయ్స్ నాటక కంపెనీ కాలం నుంచి ప్రారంభమయ్యి, ఆయన సినీ జీవితం, అన్నాదురైతో భేటీ, రాజకీయరంగ ప్రవేశం, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనం వరకూ అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయని చెప్పారు.
ఎంజీఆర్ నటుడు గానే కాకుండా ఇతర రంగాలలోనూ ప్రాచుర్యం పొందారన్నారు. ఆ విషయాలను చిత్రంలో పొందుపరచనున్నామని తెలిపారు. ఎంజీఆర్ శతాబ్ది సందర్భంగా ఆయన జీవితచరిత్రను తెరకెక్కించడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే నెల 8వ తేదీన చిత్రాన్ని ప్రారంభించనున్నామని, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి చేతుల మీదగా చిత్ర ప్రారంభం జరగనుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారని చిత్ర నిర్మాత ఏ.బాలకృష్ణన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment