అంతా.. ఒక్కటయ్యారు
ఏడాది తర్వాత ఒకే వేదికపై టీబీజీకేఎస్
ఇల్లెందు నాయకులు
ఫలించిన అగ్ర నేతల సయోధ్య చర్చలు
ఇల్లెందు అర్బన్(ఖమ్మం) : టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా కమిటీలో కొంత కాలంగా నెలకొన్న వర్గ విభేదాల సమస్య ఎట్టకేలకు సమసిపోయింది. ఇప్పటి వరకు రాజిరెడ్డి, కనకరాజు వర్గీయులు ఒకవైపు, మల్లయ్య వర్గీయులు మరో వైపు విడిపోయి యూనియన్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మల్లయ్య వర్గీయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కనకరాజు వర్గీయులు యూనియన్ కార్యాలయంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించేవారు. నిన్న, మొన్నటి వరకు గనుల్లో నిర్వహించిన పిట్ మీటింగ్‌లకు మల్లయ్య వర్గీయులు దూరంగా ఉన్నారు. యూనియన్ కార్యాలయంలోకి సైతం అడుగుపెట్టలేదు. రోజురోజుకూ పరిస్థితులు జఠిలంగా మారి ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఇరువర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మల్లయ్య, వెంకట్రావ్, రాజీరెడ్డి, కనకరాజు రంగంలోకి దిగారు. ఇటీవల కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయమై పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. బుధవారం 21 పిట్ మీటింగ్‌కు రెండు వర్గాల నాయకులం తా హాజరుకావడమే ఇందకు నిదర్శనం. సుమారు ఏడాదిన్నర పాటుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఏరియా నాయకులు ఎట్టకేలకు ఒకే వేదికపై ప్రసంగాలు ఇవ్వడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపినట్లైంది. ఇది ఇలా ఉండగా ముఖ్య నాయకులు ఇచ్చి న హామీ మేరకు పిట్‌మీటింగ్‌లో స్థానిక నాయకులంతా పాల్గొన్నారు. అయితే యూనియన్ కార్యాలయంలోకి ఇప్పటి వరకు అడుగుపెట్టని నాయకులు, కార్యకర్తలు ఇక నుంచి అడుగుపెడుతారా? లేదా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుంటారా అనేది ఇక వేచి చూడాల్సిందే.
ఏరియా ఎన్నికల కమిటీ..
టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఎన్నికల కన్వీనర్‌గా గడ్డం వెంకటేశ్వర్లు, కోకన్వీనర్‌గా కళ్లెం కోటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఐఎన్టీయూసీ నుంచి కోటిరెడ్డికి సైతం సముచిత స్థానం కల్పించడం తో యూనియన్‌లో గ్రూపు తగాదాలకు తావులేకుండా పోయిందని నాయకులు పేర్కొంటున్నారు.