ఎల్లారెడ్డిపేటలో పోలీస్ సర్కిల్
కార్యాలయాలకు భవనాల పరిశీలన
సర్కిల్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి
ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ కార్యాలయ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డిపేటలో సీఐ కార్యాలయాన్ని మంజూరు చేయించాలని అధికార పార్టీ నాయకులు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తున్నారు. ఈక్రమంలోనే సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు కానుండడం, వీర్నపల్లి మండల కేంద్రంగా ప్రకటించడంతో సర్కిల్ ఆఫీస్ ఆచరణకు నోచుకోనుంది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను బుధవారం కలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయమై విన్నవించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి పోలీస్స్టేషన్లను కలిపి సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీర్నపల్లిలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఒక ఎస్సైని కేటాయించి ఎల్లారెడ్డిపేటలోని సిబ్బందితోనే కొద్దికాలం విధులు నిర్వర్తించనున్నారు. వీర్నపల్లి ఎస్సై సైతం ఎల్లారెడ్డిపేటలోనే ఉండి శాంతిభద్రతలు పర్యవేక్షించనున్నారు.
స్థల పరిశీలన
వీర్నపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు రెవెన్యూ, మండల పరిషత్, సాగునీటిశాఖ అధికారులు బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం మాడల్ పాఠశాలలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను కొనసాగించాలని, ప్రభుత్వ పాత ఉన్నత పాఠశాలలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశాలతో కార్యాలయాలకోసం భవనాలు పరిశీలించినట్లు తహసీల్దార్ పవన్‌కుమార్, ఎంపీడీవో చిరంజీవి తెలిపారు.