టెక్స్టైల్స్ బంద్ విజయవంతం
భివండీ, న్యూస్‌లైన్ : పెరిగిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహారాష్ట్రలోని వస్త్రపరిశ్రమ వ్యాపారులు సోమవారం ఒక్కరోజు బంద్ పాటించారు. ఈ బంద్‌లో మాలేగావ్, ధులే, షోలాపూర్, యేవ్లా, వీటా, ఇచ్చల్కరంజీ, ఉల్లాస్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన అనేక పవర్లూమ్ అసోసియేషన్లు, భివండీకి చెందిన పవర్లూమ్ పరిశ్రమల యజమానులు, వివిధ పవర్లూమ్ సంస్థల పదాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యధికంగా పవర్లూమ్ పరిశ్రమలతో భారీ స్థాయిలో వస్త్రాలను ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. పవర్లూమ్ పరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే విద్యుత్ చార్జీలను పెంచి మరింత భారం మోపిందని వారు ఆరోపించారు. విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఆందోళనకారులు విద్యుత్ బిల్లుల హోలి (విద్యుత్ బిల్లులను తగులబెట్టడం) నిర్వహించారు. వస్త్రపరిశ్రమల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకవెళ్లేందుకు ఆయా ప్రాంతాల్లో సంబంధిత అధికారులకు వినతి పత్రాలను అందించారు.
భివండీలో...: పట్టణంలోని పద్మనగర్, బండారి కంపౌండ్, నారాయణ్ కంపౌండ్, ఈద్గా రోడ్, శాంతీనగర్, మీట్ పాట, తదితర ప్రాంతాలలో పవర్లూమ్ పరిశ్రమలు సోమవారం బంద్ పాటించాయి. మహారాష్ట్ర పవర్లూమ్ బున్కర్ సంఘటన అధ్యక్షులు ఫైజాన్ ఆజ్మీ నేతృత్వంలో విద్యుత్ బిల్లుల హోలి నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫైజాన్ ఆజ్మీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలను కొనసాగించి పవర్లూమ్ పరిశ్రమలకు జీవం పోయాలని డిమాండ్ చేశారు. ప్లేన్ పవర్లూమ్ యంత్రాలను ఆధునీకరించేందుకు ఇస్తున్న రుణాన్ని రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిలకడగాలేని నూలు ధరలను అదుపు చేయాలని కోరారు. నూలు కార్టన్లపై ఎమ్.ఆర్.పి, రేట్లు ముద్రించాలని, పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజ్ వసతులు, కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.భివండీ పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్స్ అధ్యక్షులు వంగ పురుషోత్తం న్యూస్‌లైన్ తో పాట్లాడుతూ.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల పవర్లూమ్ యంత్రాలు ఆగిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.