ఇంకా ప్రియా ఇంకా
నిన్ను ఎంత చూసినా సరిపోదు.
ఏ పాత్రలో చూసినా గుండె నిండదు.
నీకు క్యారెక్టర్ ఉంది.
ఇది ఇండస్ట్రీ అంతటికీ తెలుసు.
క్యారెక్టర్ నీలో ఉంటుంది.
ఇది ఆడియన్స్ అందరికీ తెలుసు.
యూ ఆర్ మేడ్ ఫర్ సినిమా.
ఇంకా ఇంకా చూడాలనిపించే ప్రియాంక
మంచి మంచి పాత్రలు ఇంకా ప్రియా ఇంకా...
ఏడు మల్లెల ఎత్తు సౌందర్యరాశి తెర మీద ప్రత్యర్థి ముక్కు పగలగొట్టే బాక్సర్‌గా ట్రాన్స్ఫామ్ కావడం ఎంత కష్టం?
ఎవరి హక్కులు ఏంటో బల్ల గుద్ది మాట్లాడగలిగే తెలివైన అమ్మాయి తెర మీద మందబుద్ధిలా మారిపోవడం ఎంత కష్టం?
తనను లోకవ చేస్తే సహించని అమ్మాయి తెర మీద తనను ఆటపట్టించే హీరో ముందు బేలగా మారిపోవడం ఎంత కష్టం?
మాట్లాడితే ఇండియన్ ఇంగ్లిష్ అని తెలిసిపోయే అమ్మాయి అమెరికా వాళ్లు కూడా విని మురిసిపోయేలా తెర మీద అమెరికన్ ఇంగ్లిష్ మాట్లాడటం ఎంత కష్టం?
ఏమీ కష్టం కాదు. ప్రియాంక తలుచుకుంటే.
♦ ♦ ♦
అమెరికా ఎఫ్బిఐలో ఒకమ్మాయి మంచి మెరిట్ ఉన్న ఆఫీసర్‌గా చేరింది. కాని ఆశ్చర్యం.ఆ అమ్మాయి మీదే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నట్టు అభియోగం వచ్చింది.వాటి నుంచి ఎలా బయట పడాలి?తనను తాను ఎలా నిరూపించుకోవాలి.అమెరికాలోనే కాదు భారతదేశంలో కూడా మంచి రేటింగ్ ఉన్న టెలివిజన్ సిరీస్ ‘క్వాంటికో’ కథాంశం ఇది.అందులో ముఖ్య పాత్ర పేరు ‘అలెగ్జాండ్రా పారిష్’.ఆ పాత్ర తయారవుతున్నప్పుడు దానిని పోషించదగ్గ వాళ్లు అమెరికాలో చాలామంది ఉన్నారని ప్రొడ్యూసర్లకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీని కోసం వెంపర్లాడతారనీ తెలుసు.కాని వారి దృష్టిలో ఉన్నది మాత్రం ఒకే ఒక నటి.ప్రియాంక చోప్రా.
ఆమె చేస్తే ఆ పాత్రకు క్రేజ్ వస్తుందని, గ్లోబల్ ఆడియన్స్ వస్తారని వాళ్ల నమ్మకం.ఆ నమ్మకం నిజమైంది.క్వాంటికో పాపులర్ సిరీస్‌గా నిలిచింది.ఆ విధంగా ప్రియాంక చోప్రా దక్షిణ ఆసియా నుంచి అమెరికన్ టెలివిజన్ సిరీస్‌లో నటించడానికి ఎంపికైన మొట్టమొదటి నటిగా రికార్డ్ సాధించింది.ఇందుకు ఆమె ఢిల్లీలో పుట్టలేదు. ముంబైలో పెరగలేదు. కలకత్తా వంటి నగరాలలో చదువుకోలేదు. అవును. ప్రియాంక ఒక స్మాల్‌టౌన్ అమ్మాయి.
♦ ♦ ♦
ప్రియాంక రెండు సందర్భాలలో బాగా టెన్షన్ పడింది.మొదటిది 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ చివరి రౌండ్లో ప్రశ్నలు ఎదుర్కొనేటప్పుడు.‘ఇక్కడి దాకా చేరుకున్నారు కదా టెన్షన్‌గా ఉందా?’ అని జడ్జి ప్రశ్నించాడామెను.‘అవును టెన్షన్‌గా ఉంది. కాని టెన్షన్ లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే క్యూరియాసిటీ ఉండదు. ఏదైనా పని సాధించాలంటే టెన్షన్ ఉండాలి’ అని హర్షధ్వానాల మధ్య జవాబు చెప్పింది.
ఫలితం ఆమె శిరస్సున మిస్ వరల్డ్ కిరీటం. రెండో సందర్భం ‘క్వాంటికో’ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు.అమెరికాలో అవకాశాలు మనలాగా ఉండవు. తెలిసిన నటుడు, తెలిసిన నటి, ఫలానా ఫేమస్ హీరో, ఫలానా టాప్ హీరోయిన్ అని ఇచ్చేయరు. ప్రతిసారీ ఈ పాత్రకు తాము సరిపోతాం అని నిరూపించుకోవాలి. ‘క్వాంటికో’ కోసం ప్రియాంకాను తీసుకోవాలని ప్రొడ్యూసర్లు భావించినా ఆమె ఆడిషన్స్‌లో ఆ పాత్రకు సరిపోతానని నిరూపించుకోవాలి. లేకపోతే పాత్ర రాదు.
ఆ సందర్భంలో ప్రియాంక టెన్షన్ పడింది. అప్పటికే ప్రియాంక హిందీలో దాదాపు 50 సినిమాలలో యాక్ట్ చేసింది. ఇండియాలో పెద్ద హీరోయిన్. అనుభవం ఉంది. అయినప్పటికీ అమెరికన్ సీరియల్లో అమెరికన్ యాక్సెంట్లో డైలాగ్ చెప్పి, మెప్పించాలి.ఒక్క క్షణం ప్రియాంక తనను తాను కూడదీసుకుంది. గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది.ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో డైలాగ్ చెప్పింది.అంతే. సెలెక్టెడ్. ఇన్నాళ్లూ హిందీలో, ప్రవాసంలో ఉన్న భారతీయులలో మాత్రమే పేరున్న ప్రియాంక ఇవాళ అమెరికా, బ్రిటన్లలో కూడా గుర్తింపు ఉన్న నటి.
♦ ♦ ♦
ప్రియాంక తల్లీ దండ్రీ ఇద్దరూ మిలటరీ డాక్టర్లు. తండ్రిది పంజాబ్‌లోని అంబాలా అయినా తల్లి ప్రాంతమైన జార్ఖండ్‌లోని జంషడ్పూర్తోనే ప్రియాంకాకు అనుబంధం. అక్కడ కొంత కాలం చదువుకుంది. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఎక్కువకాలం చదువుకుంది. ఇవి రెండూ నగరాలు కాదు. చిన్న ఊళ్లే. ఈ ఊళ్లలో ఉన్నప్పటికీ ప్రియాంక చిన్నప్పటి నుంచి చురుగ్గా క్రియాశీలంగా ఉండటానికి ఇష్టపడింది. పాడటం నేర్చుకుంది. డాన్స్ నేర్చుకుంది. టీచర్లనూ స్నేహితులను ఇమిటేట్ చేయడం, మిమిక్రీ చేయడం కూడా ప్రియాంకకు ఇష్టం. అందుకే ఆ అమ్మాయిని స్కూల్లో అందరూ ‘సన్‌షైన్’ అని పిలిచేవాళ్లు. అది తన ముద్దు పేరు. ఈ సమయంలోనే ప్రియాంకకు లోకం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఎనిమిదో క్లాస్ తర్వాత ప్రియాంక అమెరికాలోని తన పిన్ని దగ్గర చదువుకోవడానికి వెళ్లింది. అక్కడ ‘లోవా’లో చదువుకుంటున్నపుడు అనుకోకుండా జాతి వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
‘బ్రౌనీ’ అనేది ఆమెకు అక్కడి అమెరికన్ అమ్మాయిలు పెట్టిన పేరు.‘ఇక్కడికెందుకొచ్చావ్. మీ దేశం వెళ్లిపో’ అని వాళ్లు ఆటపట్టించేవారు.ప్రియాంక కాళ్ల మీద ఏవో రెండు మచ్చలు ఉండేవి. యూనిఫామ్ వల్ల ఆ మచ్చలు దాచడం వీలయ్యేది కాదు. తోటి అమ్మాయిలు ఆ మచ్చలను చూపి, ఏడిపించేవారు. మూడేళ్లు అమెరికాలో చదువుకుని వెనక్కు వచ్చేసింది ప్రియాంక. కాని తనను ఏడిపించిన మాటలను మర్చిపోలేదు.మిస్ వరల్డ్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ అయ్యింది. ఏ అమెరికాలో ఏడిపించారో అదే అమెరికాలో టెలివిజన్ స్టార్ అయ్యింది.అదీ ప్రతీకారం అంటే.మరో విషయం. ఏ కాళ్లనైతే చూసి వెక్కిరించారో అదే కాళ్లకు సంబంధించి ప్రియాంక 11 ఉత్పత్తులకు మోడల్‌గా ఉండి, వాటి అమ్మకాలను పెంచింది.
♦ ♦ ♦
క్యారెక్టర్ డిమాండ్ చేయాలి. వేశ్యగా కావాలంటే వేశ్యగా చేస్తాను. రేప్‌కు గురి కావాలంటే అవుతాను. అవసరమైన శృంగార సన్నివేశాలలో నటించమంటే నటిస్తాను. దాని అర్థం పాత్రను సీరియస్‌గా తీసుకుంటున్నాననే. అంతే తప్ప నిజ జీవితంలో కూడా పక్క ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానని కాదు– అంటుంది ప్రియాంక.
♦ ♦ ♦
ప్రియాంకకు బాలీవుడ్లో అంతా సజావుగా జరిగిపోలేదు. సన్ని డియోల్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి హీరోలతో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. పైగా కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె... తదితర హీరోయిన్లు వెలిగిపోతున్నారు. వీళ్ల మధ్య తానూ నిరూపించుకోవడం చిన్న విషయం కాదు. ఆ సమయంలోనే మొదటిసారికి హృతిక్ రోషన్‌తో కలిసి ‘క్రిష్’ (2006)లో నటించే అవకాశం వచ్చింది. అది హిట్. అదే సంవత్సరం షారుక్ ఖాన్‌తో ‘డాన్’లో నటించే అవకాశం కూడా వచ్చింది. అదీ పెద్ద హిట్. ఈ రెండు సినిమాలూ ప్రియాంకను నిలబెట్టాయి కాని, ఆమెను ఒక నటిగా కాదు. అందుకు ఒక అవకాశం అవసరమైంది. అది మధుర్ భండార్కర్ రూపంలో వచ్చింది. ‘పేజ్ 3’, ‘ట్రాఫిక్ సిగ్నల్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన మధుర్ భండార్కర్ మోడలింగ్ ప్రపంచం మీద వ్యాఖ్యానం చేస్తూ ‘ఫ్యాషన్’(2008) తీయడానికి ముందుకొచ్చాడు.
అందులో చిన్న పట్టణం నుంచి ముంబై చేరుకుని టాప్ మోడల్‌గా ఎదగడానికి సంఘర్షణ పడే పాత్రను ప్రియాంక అద్భుతంగా పోషించింది. ఆ పాత్ర ఎంత బాగా అందరికీ నచ్చిందంటే జాతీయ ఉత్తమ నటి అవార్డు ఆమెకే కైవసమైంది. అయినా ప్రత్యర్థులు దీనిని లెక్క చేయలేదు. ఫ్లూక్ అన్నారు. ప్రియాంక ఓపిక పట్టింది. ఈసారి ఆమెకు ‘బర్ఫీ’ (2012)లో నటించే అవకాశం వచ్చింది. పాత్ర– మెంటల్లీ ఛాలెంజ్డ్ యువతి. అలాంటి పాత్రను ప్రియాంక ఏ మాత్రం చేయలేదని, భంగపడుతుందని అందరూ అనుకున్నారు. సినిమా రిలీజైంది. అన్న నోళ్లే వెళ్లబెట్టాయి. మానసిక వికలాంగురాలిగా ప్రియాంక తెరపై సాధించిన మార్కులు నూటికి 150. ఇక ఒకరూ అరా ప్రత్యర్థులే మిగిలింది. వీళ్లందరినీ ‘మేరీ కోమ్’ (2014) సినిమాతో శాశ్వతంగా తరిమి కొట్టింది ప్రియాంక. ఈశాన్య భారతంలో నిరుపేద నేపధ్యం నుంచి బాక్సింగ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ‘మేరీ కోమ్’ పాత్రలో ప్రియాంక ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది.
♦ ♦ ♦
‘దిల్ ధడక్ నే దో’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి సినిమాలు ప్రియాంక ఖాతాలో ఉన్నాయి. ఇంకా అనేక గొప్ప సినిమాలు ఆమె కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు ప్రియాంక వ్యక్తిగత అభిరుచులు నిలుస్తాయి. ప్రియాంక ఫెమినిస్ట్ అని చెప్పుకుంటుంది. అయితే అది మగవాళ్లను ద్వేషించే ఫెమినిజమ్ కాదు. ‘నా జెండర్ వల్ల కాకుండా నా మెరిట్ వల్ల నాకు దక్కవలసిన అవకాశం కోసం పోరాడే ఫెమినిజం’ అంటుంది. ప్రియాంక గే, లెస్బియన్ హక్కులను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆమె పిల్లల హక్కుల కోసం కూడా పని చేస్తోంది.
♦ ♦ ♦
ప్రియాంక ఇంకా పెళ్లి చేసుకోలేదు.షాహిద్ కపూర్ కొంత కాలం ఆమె బోయ్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఆమె కోరితే వరుస కట్టేవాళ్లు చాలామందే ఉన్నారు. కాని ప్రియాంక తన కెరీర్లో బిజీగా ఉంది. లక్ష్యం తర్వాత లక్ష్యాన్ని నిర్థారించుకుంటూ వెళుతోంది. ఆమె ఈకాలం యువతులందరికీ స్ఫూర్తి. చిన్న పట్టణాల యువతులూ అదిగో పెద్ద గీత. దాని పేరే ప్రియాంక చోప్రా.
హడల్
బాలీవుడ్లో కొందరు వెధవలు కూడా ఉంటారు. మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యాక బాలీవుడ్లో అవకాశాలు వస్తుండగా అలాంటి వెధవలు కూడా తగులుతుంటారు. ఒక సినిమాకు సైన్ చేసింది ప్రియాంక.రెండు రోజులు షూటింగ్ జరిగింది.మూడో రోజు షూటింగ్లో ఉండగా దర్శకుడు వచ్చి ప్రియాంక ముందరే కాస్ట్యూమ్ డిజైనర్‌తో గొడవ పెట్టుకున్నాడు. ‘ఏంటీ కాస్ట్యూమ్స్. ఇవి వేసుకున్న హీరోయిన్ని ఎవరు చూస్తారు. కాస్ట్యూమ్ వేస్తే హీరోయిన్ పైన ఏముందో కనిపించాలి... కింద ఏముందో కనిపించాలి...’ అని ఇంకా చాలా చెత్త మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియాంక వింది. నేరుగా కారెక్కి ఇల్లు చేరుకుంది. అప్పటికి పెద్దగా డబ్బు కూడా లేదు. కాని మొత్తం అడ్వాన్సు, రెండు రోజుల షూటింగ్‌కు అయిన ఖర్చు మొత్తం తిరిగి పంపించేసింది. ఆ సినిమా తను చేయదు. ఆడపిల్లలు గ్లామర్ ఫీల్డ్‌లోకి వస్తే దేనికైనా సిద్ధపడి వచ్చుంటారని కాదు అర్థం. ఆ రంగంలో తాము నిరూపించుకోవడానికి వచ్చారని అర్థం. ఆ విషయం ఇండస్ట్రీ అంతా పాకింది. ప్రియాంక అంటే అందుకే అది ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటుంది.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి