ఎస్సెమ్మెస్‌తో పవర్ ఆన్.. ఆఫ్
రూపొందించిన వరంగల్ జిల్లా యువ ఇంజనీర్
ఆత్మకూరు : ఒక్క ఎస్సెమ్మెస్.. టెక్ట్స్ అయినా, వాయిస్ అయినా ఇట్టే పవర్ ఆన్ అవుతుంది... ఆఫ్ అవుతుంది. ఏ ఊర్లో ఉన్నా ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేయొచ్చు.. ఆఫ్ చేయొచ్చు. దీన్ని ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఓ యువ ఇంజీనీరింగ్ రూపొం దించాడు. గ్రామానికి చెందిన తోట రాజ్‌కుమార్ పెంబర్తిలోని విద్యాభారతి ఇంజినీరింగ్‌కళాశాలలో 2011లో బీటెక్(ఈసీఈ) పూర్తిచేశాడు. ఈఏడాది వరంగల్‌లోని పాత్‌ఫైండర్ కాలేజీలో ఎంటెక్ పూర్తిచేశాడు. ఇతను ఎస్సెమ్మెస్ ద్వారా పవర్ ఆన్.. ఆఫ్ విధానాన్ని రూపొందించాడు. ఈపరికరాన్ని ఎలా రూపొందించాడో అతని మాటల్లోనే...‘మనం నిజజీవితంలో వాడే ఫ్యాన్, బల్బ్ తదితర విద్యుత్ ఉపకరణాలను స్విచ్‌ల ద్వారా కాకుండా మెస్సేజ్, వాయిస్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. బ్లూ టూత్ లేదా ఏఎంఆర్ వాయిస్ అనే అప్లికేషన్‌తో వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. 8051 మైక్రో కంట్రోల్ పరికరంతో మన ఇంట్లో వస్తువుల అనుసంధానం ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు.
ఇందులో ఎంబడ్డెడ్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఎల్సీడీ, క్రిస్టల్ ఆస్కిలేటర్, 8051 మైక్రో కంట్రోలర్, జీఎస్ఎం సెట్, మ్యాక్స్232, పీసీ, బ్లూటూత్, రిలేస్, ఫ్యాన్, లైట్ ఉపయోగించాలి. దీనిలో జీఎస్ఎం సెట్ చేసి ఉంటుంది. ఇందులో ఒక సిమ్‌కార్డు ఉంచి ఆనబర్కు మెసేజ్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఏఆర్ఎంటీ(ఎల్పీసీ2148) ప్రాసెసర్ ఫిక్స్ చేయబడి ఉండి మన ఆదేశాలను తీసుకొని బైనరీ ఫామ్‌కు మార్చుకొని మనకు అవుట్‌పుట్‌ని అందిస్తాయి. దీన్ని ఇంటర్నెట్ మరియు మొబైల్ద్వారా ఎస్సెమ్మెస్ చేసి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. వాయిస్ కంట్రోల్ అయితే 20 మీటర్ల దూరం నుంచి బ్లూటూత్సహాయంతో , ఆటోమేటిక్ కాల్లిఫ్టర్, జీఎస్ఎం సెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఈపరికరంతో బహుళ అంతస్తుల భవనాలు, కంపెనీలు, షోరూంలు, సంస్థలు, గృహాల్లో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా లబ్ధి పొందవచ్చు.’ తనకు ఆర్థికసాయం చేస్తే ఈపరికరాన్ని మార్కెట్లోకి తీసుకువస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు.