గర్ల్‌ఫ్రెండ్ వివాదం.. అన్నను చంపిన తమ్ముడు
అర్ధరాత్రి పూట తనను బయటకు పంపి, గర్ల్‌ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తున్నాడన్న కోపంతో సొంత అన్నను డంబెల్‌తో కొట్టి చంపేశాడో పీజీ విద్యార్థి. ఈ సోదరుల తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఝాన్సీలో నివసిస్తారు. తనను బయటకు ఎందుకు పంపుతున్నావంటూ ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న హిమాంశు వర్మ (23) తన అన్న హితేష్ (28)తో గొడవ పడ్డాడు. రాత్రిపూట చలిలో తాను బయట ఉండలేనని అన్నాడు. ఆ విషయమై ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో కోపంతో డంబెల్ తీసుకుని అన్నమీద విసిరేశాడు. అంతేకాక.. అతడు చనిపోయేవరకు దాంతో కొట్టాడు.
బాధితుడు హితేష్ ఓ కాలేజిలో సంస్కృతం చెబుతుంటాడు. రాత్రి 1.30 గంటల సమయంలో అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చి, హిమాంశును బయటకు వెళ్లమని చెప్పాడు. ప్రతి రెండు రోజులకోసారి అతడు అలాగే చేస్తున్నాడని హిమాంశు పోలీసులకు చెప్పాడు. ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటంతో తనకు కోపం వచ్చిందని, ఆ చలిలో బయటకు వెళ్లడానికి తాను నిరాకరించానని అన్నాడు. అన్నను చంపిన తర్వాత తానే పోలీసులకు రాత్రి 3 గంటల సమయంలో ఫోన్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన అన్నను చంపారని కట్టుకథ అల్లాడు. చంపడానికి ఉపయోగించిన డంబెల్‌ను మంచం కింద దాచేశాడు.
అయితే రాత్రి ఎవరూ ఇంటికి రాలేదని ఇంటి యజమాని చెప్పారు. మొదటి అంతస్థుకు వెళ్లడానికి ఒకటే దారి ఉండగా.. కింద గ్రౌండ్‌ఫ్లోర్‌లో యజమాని ఉంటారు. గట్టిగా ప్రశ్నించినప్పుడు హిమాంశు ఒక్కసారిగా ఏడ్చేసి, తన నేరాన్ని అంగీకరించాడని డీసీపీ మాధుర్ వర్మ చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఢిల్లీకి వచ్చిన రెండు నెలల తర్వాత హితేష్ ఓ అమ్మాయితో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో దాన్ని రహస్యంగా ఉంచినా, తర్వాత హిమాంశుకు తెలిసిపోవడంతో సహకరించాలని కోరాడు. మొదట్లో అంగీకరించినా, అర్ధరాత్రి బయటకు పంపడంతోప తట్టుకోలేకపోయానని హిమాంశు పోలీసులకు చెప్పాడు.