జెట్ ఎయిర్వేస్ మరో ఆఫర్
ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ తన ప్రయాణికులకోసం ఒక వెసులు బాటు కల్పిస్తోంది. నిర్ధారిత సమయంకంటే ముందుగా వెళ్లాలనుకునే వారికి విమాన టికెట్ ను ప్రీపోన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే అలా ప్రయాణించాలనుకున్నవారు వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ ఈ అవకాశాన్ని ప్రయాణికులకు కల్పిస్తోంది. అంటే టికెట్ క్యాన్సిలేషన్, మళ్లీ బుకింగ్ లాంటి తల నొప్పులేవీ లేకుండా.. నామమాత్రపు రుసుంతో సింపుల్ గా ప్రయాణాన్ని ముందుకు జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రయాణీకులకు నామమాత్రపు రుసుముతో అంతకుముందు విమాన బుకింగ్ మార్చడానికి అవకాశం కల్పిస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ అవకాశాన్నిగరిష్టంగా నాలుగు గంటల ముందు వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సమయం మార్పు, సీట్లు లభ్యత తదితర వివరాలను చెక్-ఇన్ కౌంటర్ దగ్గర నిర్ధారించబడుతుందని తెలిపింది. ఈ సౌకర్యం జెట్ ఎయిర్వేస్ దేశీయ నెట్ వర్క్ అంతటా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను భారీగా వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఈ నేపథ్యంలో సంస్థలకు కొత్త నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే.