రఘురాముడి శాంతి మంత్రం
కర్నూలు, న్యూస్‌లైన్: నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండ పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికి నిరక్షరాస్యత, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించి ఎస్పీ రఘురామిరెడ్డి యువతలో మార్పు తీసుకొచ్చేందుకు తనదైన శైలిలో చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనుకబడిన ఆదోని సబ్‌డివిజన్ పరిధిలోని కోసిగి, ఆలూరు, మాదవరం, మంత్రాలయం సమీప ప్రాంతాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కృష్ణపట్నం పోర్టులో పర్మనెంట్, ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని 380 మంది యువకులకు సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఏఆర్ డీఎస్పీ రుషికేశ్వర్‌రెడ్డి, కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ పి.కె.మనోహర్‌బాబు, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు సోమశేఖర్‌నాయక్, నారాయణ, ఇతర పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండి, 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి 167 సెం.మీ ఎత్తు, ఛాతీ గాలి పీల్చకుండ 81 సెం.మీ, గాలి పీల్చిన తర్వాత 86 సెం.మీ ఉండాలి. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. దీంతో పాటు అభ్యర్థులకు పులప్స్ పరీక్షలు నిర్వహించారు.
పుట్టిన తేదీ, ఎత్తు ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించడంతో పాటు స్టైఫండ్ కింద రూ.1500 చెల్లిస్తామని సీనియర్ మేనేజర్ పి.కె.మనోహర్ తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.7,500(పీఎఫ్, ఈఎస్ఐతో పాటు) ఇస్తామని, ఉచిత భోజన వసతి సౌకర్యం, మెడికల్, యూనిఫామ్ వంటి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల్లో విద్యార్హతలను పరిగణలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టులోని సీసీ టీవీ, మెరైన్, కోస్టల్, టెక్నికల్, మార్షల్స్, వీఐపీ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ఉపాధి కల్పిస్తారు.
మలి విడతలో ఆత్మకూరు, కర్నూలు:
మలివిడతలో కర్నూలు నగరంలోని మురికివాడల్లో నివసించే యువతతో పాటు ఆత్మకూరు ప్రాంతానికి చెందిన చెంచులు, ఆసక్తి ఉన్న ఇతర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎస్పీ చర్యలు చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువకులు నిరుద్యోగులుగా ఉండటంతో ఫ్యాక్షన్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. తమ పిల్లలు హింస వైపు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. యువతలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసు శాఖ చేపట్టిన ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.