వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఆగని వేధింపులు
అనంతపురం: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార టీడీపీ వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఓబులమ్మ ఉలవ పంటను టీడీపీ కార్యకర్తలు సోమవారం ధ్వంసం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కారణమని బాధితురాలు ఆరోపిస్తోంది. తన భర్త సూరయ్య హత్య కేసులో పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యవుల శీనప్ప నిందితుడుగా ఉన్నాడని ఆమె తెలిపారు. ఆ కారణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసులో రాజీ పడనందుకే తమ భూమిని లాక్కునేందుకు పయ్యావుల సోదరుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.