విజయ పర్వం
లోక్‌సభ ఎన్నికల బరిలో మహాద్భుత ఘట్టానికి తెర లేవనుంది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేయనుండటంతో ఎల్లెడలా పండగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులన్నీ ఆనందోత్సాహాలలో మునిగిపోయాయి. నగర, జిల్లా పరిధిలోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలలోని వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయమ్మ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. మహానేత సతీమణికి నీరాజనాలెత్తేందుకు మహిళాలోకం, జగనన్న మాతృమూర్తికి విజయోస్తూ అంటూ దీవెనలందించేందుకు ఆబాల గోపాలం ఉవ్విళ్లూరుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, జననేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు. పార్టీ తరఫున విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తొలుత ఉదయం 10 గంటలకు పార్టీ నగర కార్యాలయానికి చేరుకుంటారు.
కార్యాలయంలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 11.30 గంటలకు జగదాంబ కూడలికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరతారని పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద తన కుమార్తె షర్మిలతో కలిసి పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 1 గంట సమయంలో షర్మిలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారన్నారు.
భారీ సన్నాహాల్లో నేతలు
విజయమ్మ నామినేషన్ ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన నగర నియోజకవర్గ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేశారు. రూరల్ జిల్లాలో కూడా అరకు, మాడుగుల, యలమంచిలి మినహా మిగిలిన నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. దీంతో నేతలంతా తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు నామినేషన్ దాఖలుచేసే మహత్తర కార్యక్రమానికి సాక్షులుగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాల నుంచి భారీగా అభిమానులు వెంటరాగా విజయమ్మ నామినేషన్‌కు మద్దతు పలకనున్నారు.