breaking news
YSRCP Digital Book
-
డిజిటల్ బుక్ ముకుతాడు వేస్తుందా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. పార్టీ కార్యకర్తల రక్షణకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా పార్టీ లీగల్ టీమ్ వెంటనే రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్‌లో ఎలా నమోదు చేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీసు అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైనా, అక్రమ అరెస్టు జరుగుతున్నా, వెంటనే వాటిని చిత్రీకరించి డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తే లీగల్ సెల్ తక్షణమే చొరవ తీసుకుని పని చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్‌లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులు వైసీపీ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టకుండా ఉండే చాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీపరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయింది.పోలీసులు మఫ్టీలో వచ్చి సవీంద్రరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అదుపులోకి తీసుకున్న వెంటనే లీగల్ టీమ్ అతని తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. హైకోర్టు కూడా పౌర రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతిని అర్థం చేసుకున్న కోర్టు సవీంద్రరెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇదో రికార్డు. కేసును సీబీఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియచేస్తుంది.అంతేకాదు.. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీసు స్టేషన్లలోనే గంజాయిని అందుబాటులో ఉంచుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కూడా కలుగుతుంది. అందుకే హైకోర్టు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారనుకోవాలి. ఇంత జరిగినా కొందరు పోలీసులు మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులను అదే రోజు అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది.ఈ బుక్‌లో సాక్ష్యాధారాలు కూడా నమోదు అవుతాయి కనుక అవి ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. అదే టైమ్‌లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతుంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పరకామణి వ్యవహారంలో జగన్‌పై నీచమైన ఆరోపణలు చేస్తూ టీడీసీ సోషల్ మీడియా ప్రచారం చేసిందట. అది తప్పా? కాదా? అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు. కాని టీడీపీ వారు ఏమీ చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ధర్మబద్దంగా చర్య తీసుకోవల్సిన పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియచేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేయవచ్చు. కాని డిజిటల్ బుక్ పరిధి పెరుగుతుంది. ఎంతవరకూ ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అలాగే డిజిటల్ బుక్ జరగకుండా జాగ్రత్తపడాలి.అంతే కాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటరై తప్పుడు ఆరోపణలు చేయకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.డిజిటల్ బుక్‌తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు, కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి ధైర్యం ఇచ్చిన వైనం కచ్చితంగా పార్టీ కేడర్‌కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది.కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్‌లో అలాంటి అభిప్రాయం నెలకొంది.. అది వేరే విషయం. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు ఆస్పత్రులు వంటివాటిని ఎందుకు ప్రభుత్వాలు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు.అట్టర్ ఫ్లాఫ్ అయిన సూపర్ సిక్స్‌కు విజయోత్సవ సభ జరిపారని ఎద్దేవా చేశారు. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్ పై దాడి, మరో వైపు కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి ఈ సమావేశంలో జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగానే డిజిటల్ బుక్ తెచ్చారు. దీని ప్రభావంతోనైనా ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టే విషయంలో కాస్త అయినా వెనక్కి తగ్గుతారా! ఏమో చెప్పలేం!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ప్రజలను వేధించడానికే.. కూటమి అధికారంలోకి వచ్చింది’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలను పీడించడానికే అంటూ ఆరోపించారు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కురసాల కన్నబాబు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు అని అన్నారు. కొడుకు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబే ఆయనే వేధింపులను నేర్పిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కాకినాడ రూరల్‌లో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్‌ను ఉత్తరాంధ్ర జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమికి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి.. వైఎస్సార్సీపీని అణగదొక్కడానికే. సామాన్యుల నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ కోసం పోలీసులను ఆయుధంగా వాడుతున్నారు. పోలీసులు ఎందుకు దిగజారిపోయి పని చేస్తున్నారని సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు అని చెప్పాలి. అలా కాకుండా.. ప్రజల్ని పీడించుకుని, వేధించుకుని తిను అని చంద్రబాబు తన కొడుక్కి నేర్పించాడు. వైఎస్సార్సీపీ శ్రేణులు.. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలకు సంక్షేమం ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలానా పథకం రాలేదని అడగాలంటే భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ అన్యాయాలు అన్నింటినీ తప్పకుండా డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
‘డిజిటల్ బుక్‌లో ఫిర్యాదులు, వీడియోలు రికార్డ్ అవుతున్నాయి’
సాక్షి, చిత్తూరు: ఏపీలో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.చిత్తూరులో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. మీ పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కానీ, వైఎస్ జగన్.. ప్రజల సంక్షేమం లక్ష్యంగా పాలన చేశారు. టీడీపీ కమిటీలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. జగనన్న సైనికులు అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మనకు 18 లక్షలు మంది క్రియాశీలక సైన్యం ఉంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం, అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను మన సోషల్ దీటుగా ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారు.మనం డిజిటల్ బుక్‌ను లాంచ్ చేశాం. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు. ఫిర్యాదులు వస్తున్నాయి, వీడియోలు రికార్డు చేస్తున్నాం. డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయవచ్చు. చట్టబద్ధంగా వారిని శిక్షించేందుకు ఇది ఉపయోగ పడుతుంది. ప్రతీ ఒక్కరికి పార్టీ గుర్తింపు కార్డులు అందిస్తాం, టెక్నాలజీ వాడుకుని ముందు వెళ్తున్నాం. అన్యాయమైన పాలన చంద్రబాబు సాగిస్తున్నారు. ఓటర్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ కార్యకర్త, నాయకులు అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిర్మాణాత్మకమైన పార్టీగా, సంస్థాగతంగా సిద్ధం చేస్తాం. రాబోయే 30 ఏళ్లలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నాం. ప్రత్యర్థులను వణుకు పుట్టించేలా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సమావేశానికి హాజరయ్యారు. బీటలు వారిన కోటలు టీడీపీ అని వ్యాఖ్యలు చేశారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత, రాబోయే ఐదేళ్లు వీరికే బాధ్యత అప్పగిస్తామన్నారు.భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అన్ని కమిటీలు నియమించిన మొట్టమొదటి నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత. జగనన్న మాటగా మీరు గ్రామస్థాయిలో తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగనివ్వను. కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత అని జగనన్న చెప్పారు. ఈసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇచ్చారు. -
డిజిటల్ బుక్‌తో కూటమికి ఇక సినిమానే!
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ బుక్ యాప్(YSRCP Digital Book)ను లాంచ్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ గురించి సమావేశం అనటతరం బయటకు వచ్చిన నేతలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసే వీలుందని తెలిపారు. ‘‘కార్యకర్తల కోసం డిజిటల్ బుక్‌ను వైఎస్ జగన్ లాంచ్ చేశారు. రెడ్‌బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుంది. రెడ్‌బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేరొనవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ ఉంటుంది. అన్యాయం చేసిన వారు ఎక్కడున్న సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారు’’ అని వివరించారు. అదే సమయంలో.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో చేస్తున్న ప్రతీకార రాజకీయాలపై గతంలోనూ వైఎస్ జగన్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశారు. ‘‘కూటమి పాలనలో ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వైఎస్సార్సీపీలో పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం. రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే.. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం’’ అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ బుక్ పేరిట ఇప్పుడు యాప్ విడుదల చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన కూటమి సర్కార్