భక్తి ముసుగులో అద్దాల మేడలో అకృత్యాలు!
భక్తి ముసుగులో ఆ అద్దాల మేడలో జరుగుతున్నఅకృత్యాలు బట్టబయలయ్యాయి. ఇంతవరకూ బ్రహ్మపదార్థంలా మిగిలిపోయిన ఆ విలాసవంతమైన భవంతి అసలు బాగోతం వెల్లడయిం ది. రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడేళ్లుగా అక్కడ ఓ పెద్ద భవనంలో ఆశ్రమం నిర్వహిస్తున్నా స్థానికులు ఆ భవనం గేటు దాటి లోపలికి వెళ్లిన దాఖలాలు లేవు. ఎవరో కార్లపై వస్తారు.
తెల్లని దుస్తులు ధరించి ప్రార్థనలు చేస్తారు, వెళ్లిపోతారు. ఈ విషయాలు తప్ప స్థానికులకు అక్కడ జరుగుతున్న వ్యవహారాలు తెలీవు. అయితే శుక్రవారం ఆ భవనంలోకి పోలీసులు ప్రవేశించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
కొత్తవలస(లక్కవరపుకోట): ‘నేను దేవుడి ప్రతిరూపాన్ని. నాతో రమిస్తే మిమ్మల్ని నేరుగా బాధలు లేని స్వర్గానికి పంపుతాను రండి’ అంటూ ఓ మత ప్రచారకుడు సాగిస్తున్న కీచక పర్వం బట్టబయలైంది. ఈ దురాగతానికి బలైన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అక్కడి అకృత్యాలు వెలుగుచూశాయి. కొత్తవలసలోని సన్‌సిటీ వీధిలో యూదుల ఉద్యాన వన ఆశ్రమం ఉంది.
ఆశ్రమం నిర్వాహకుడు దొడ్డి దయాసాగర్ వలలో పడి తాను మోసపోయానంటూ విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస సీఐ సంజీవరావు కేసు నమోదు చేసి ర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌రావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నానికి చెందిన దొడ్డి దయాసాగర్ అనే వ్యక్తి కొత్తవలస-విజయనగరం రోడ్డులోని హైస్కూల్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న సన్‌సిటీ వీధిలో సుమారు ఏడేళ్ల క్రితం యూదుల ఉద్యానవన ఆశ్రమం ఏర్పాటు చేశారు. అత్యంత విలాసవంతంగా ఉన్న అద్దాల మేడలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 200 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా మత సంబంధ ప్రార్థనలు చేస్తుంటారు. అందమైన అద్దాల మేడలో ఏం జరుగుతోంది ? ఎవరెవరు వస్తారు? ఏం చేస్తారనే విషయాలు స్థానికులెవరికీ పెద్దగా తెలియదు.
కాగా, ఈ ఆశ్రమానికి వచ్చిన కొందరు మహిళలను ఆశ్రమ నిర్వాహకుడు అయిన దయాసాగర్ వశపరుచుకున్నాడు. తనతో సంభోగిస్తే నేరుగా స్వర్గప్రాప్తి పొందుతారని చెప్పి అమాయకులైన మహిళలను మోసగించాడు. ఏడుగురు మహిళల తనతో సంభోగం చేస్తే వారికి స్వర్గం ప్రాప్తి కలుగుతుందని ఈ విషయాలన్నీ మత గ్రంథాల్లో ఉన్నాయని నమ్మించాడని మోసపోయిన మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. తాము కూడా ఆశ్రమ నిర్వాహుకుడు దయాసాగర్ చేతిలో మోసపోయినట్లు మరికొంత మంది మహిళా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. దయాసాగర్ రాసలీలలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
పోలీసులను అడ్డుకున్న సభ్యులు
పోలీసులు, విలేకరులతో కలిసి భవనంలో ప్రవేశించిన సమయంలో అక్కడి సభ్యులు అడ్డుకున్నారు. ఇతరులు లోనికి రాకూడదని అడ్డుచెప్పడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. సొసైటీ భవనంలో సౌకర్యాలను, విలువైన నిర్మాణాలు, వస్తువులు, అత్యాధునిక హంగులతో లైవ్ కవరేజ్‌కు ప్రత్యేక కెమెరాలు, భవనంలోకి వచ్చే భక్తులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన తెల్లని వస్త్రాలు, గ్రానైట్బొమ్మలు, ఖరీదైన ఫర్నీచర్ చూసి పోలీసులకు మతిపోయినంత పనైంది. ఆశ్రమంలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎలాంటి పూజలు చేస్తారు, ఎవరిని అనుమతిస్తారు.
ఎలాంటి ప్రసంగాలు ఇస్తారు అనే విషయంపై నిర్వాహకుని సోదరుడు భానుప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆశ్రమం నిర్మాణాన్ని ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారు? ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అన్న విషయాలు అడగ్గా సుమారు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు సంవత్సరాల్లో నిర్మించినట్లు భానుప్రకాష్ తెలిపారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి *ఆరేడు కోట్లు వ్యయమై ఉంటుందని, ఇంతటి విలువైన భవనాలు ఈ ప్రాంతంలో లేవని పోలీసులు తెలిపారు. ఆశ్రమంలో ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆశ్రమంపై అంతస్తులో నిర్వాహకుడు దయాసాగర్ ప్రత్యేకంగా తయారు చేసుకున్న గదిని చూసి పోలీసులకు దిమ్మతిరిగింది. ఈ ఆశ్రమానికి వెళ్లేవారంతా యూదు మతస్తులే అని పోలీసు దర్యాప్తులో తేలింది. భవన నిర్మాణానికి, నిర్వహణకు విదేశీ నిధులు వస్తున్నాయా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
స్థానికులు ఏమన్నారంటే
ఆశ్రమం కట్టింది మొదలు బయట వాళ్లెవ్వర్నీ లోనికి అనుమతించలేదని స్థానికులు తెలిపారు. యూదు మతస్తులు మాత్రమే వెళ్తుంటారని, పెద్ద కార్లలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోతుంటారని చెప్పారు. ఆశ్రమానికి వచ్చే వారు వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారు తమ సంపాదనలో 10 శాతాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తున్నారని చెప్పారు. లోపల ఏం జరుగుతుందో ఎంత మంది ఉంటారో తమకు ఏమీ తెలీదని చెప్పారు. ఇప్పుడు పోలీసులు వచ్చాక అన్నీ తెలుస్తున్నాయని, దయాకర్‌కు స్థానిక నాయకులు, పెద్దోళ్లందరితో పరిచయాలు ఉన్నాయని చెప్పారు.
ఆరోపణల్లో వాస్తవం లేదు ...
మహిళ ఇచ్చిన ఫిర్యాదు వెనుక కొంతమంది కుట్ర ఉందని ఆశ్రమ నిర్వాహకుడు దయాకర్ భార్య వాసవి చెప్పారు. తమ మతానికి చెందిన 200 మంది ఆశ్రమంలో సభ్యులుగా ఉన్నారన్నారు. వీరిలో కొంతమంది తమ మతాచారానికి విరుద్ధంగా వ్యవహరించడంతో బహిరంగంగా ప్రకటన ఇచ్చి 11 మందిని తొలిగించినట్టు చెప్పారు. అలా తొలగించిన వారిలో కొందరు ఈ కుట్ర చేస్తున్నారు, వారిని పరమ తండ్రే చూసుకుంటారని ఆమె తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు.