‘శ్రీ’వరి దిగుబడుల సిరి!
కాడి మేడి వదిలి ఉన్న ఊళ్లోనే కూలికెళ్లిన రైతును శ్రీ వరి సాగు నిలబెట్టింది. పాక్షిక సేంద్రియ పద్ధతుల్లో, తక్కువ నీరు, ఖర్చుతోనే అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతుగా పురస్కారాన్ని అందుకునేలా చేసింది.
నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన యువరైతు షేక్ నబీ పేదరికం కారణంగా చదువుకు పదో తరగతితో స్వస్తి పలికాడు. కూలి పనులకు వెళుతూ.. తమకున్న 2 ఎకరాల పొలంలో వరి, కూరగాయలు సాగు చేసేవాడు. తరచూ నష్టపోవాల్సి రావటంతో.. సాగు నుంచి విరమించుకొని పూర్తిగా కూలిపనులకే వెళ్లసాగారు. ఈ ఏడాది దేశివాళి సన్నరకం కంచర్లను నబీ ఖరీఫ్‌లో సాగు చేశారు. వేపాకు, పచ్చిపేడ, జీలుగాకు, చిప్పలాకు, గానుగ, బిటుకాకులను స్థానికంగా ఉన్న కొండ పైనుంచి సేకరించి.. దమ్ము చేసిన పొలంలో వేశారు. కొన్ని రోజులు మురిగాక మరో దఫా దమ్ము చేశారు. 10 నుండి 15 రోజుల వయస్సు గల రెండు ఆకుల నారును నాటాడు. శ్రీ వరి సాగులో 15 రోజులు పై బడిన నారును వాడితే దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
మొక్కల వేర్లు మరీ లోతుగా కాకుండా నాటారు. సాళ్ల మధ్య, మొక్కల మధ్య 25 సెం. మీ. ఎడం పాటించారు. నెలకు మూడుసార్లు వీడర్‌తో దున్నటం వల్ల కలుపు నిర్మూలమవటమే కాక.. వేర్లు పెరగటానికి.. ఎక్కువ పిలకలు రావటానికి దోహదం చేసిందంటున్నారాయన. ఐలాకు, వేపాకు, చిప్పలాకు, బిటుకాకుల ద్రావణంతో చీడపీడలను తొలి దశలోనే నివారించగలిగారు. నారు నాటేటప్పుడు 25 కిలోలు డిఏపీ, పొట్ట దశలో 25 కిలోల యూరియా ఎరువులను మాత్రమే వాడానన్నారు. అలాగే వేపాకు పొడిని 25 కిలోలు పొట్ట దశలో వేశారు. 50 - 60 పిలకలు వచ్చాయి. నాట్లు దూరంగా వేయటం వల్ల ఎకరాకు రూ. 1500 కూలీల ఖర్చు ఆదా అయ్యింది. వీడర్ వల్ల రూ. 2 వేల వరకు ఖర్చు తగ్గింది. మొత్తంగా ఎకరాకు రూ. 6 వేల ఖర్చయ్యింది. ధాన్యాన్ని మిల్లు పట్టించి క్వింటాల్‌కు రూ. 3200 చొప్పున అమ్మగా రూ. 71 వేల ఆదాయం వచ్చింది. ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం లభించిందని షేక్‌నబీ (94905 68554) తెలిపారు.
- రమణాకర్, తుర్కపల్లి