2.9 లక్షల మందికి గ్రూప్–2 హాల్ టిక్కెట్లు
ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రూప్–2 కేటగిరీలోని 982 పోస్టులకు ఈనెల 26న నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు 2.9 లక్షల మందికి హాల్‌టిక్కెట్లను జారీ చేసింది. అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిజర్వేషన్, స్థానికత విషయంలో తప్పులు దొర్లినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఆ పొరపాట్లను స్క్రీనింగ్ టెస్టు అనంతరం పరిష్కరిస్తామని, అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. అభ్యర్ధుల వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్), ఎగ్జామినేషన్ అప్లికేషన్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వివరించారు.