భల్లూకపు కౌగిలికి భయపడుతున్న ముస్లింలు!
బిజెపి భల్లూకపు కౌగిలిని ఏరికోరి ఎంచుకుంటున్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోని మైనారిటీలు దూరం అవుతున్నారా? పసుపు, కాషాయం కలయిక వల్ల చంద్రబాబు పై ప్రశ్నచిహ్నాలు పడుతున్నాయా?
అవుననే అంటున్నారు టీడీపీలోని మైనారిటీ నేతలు. గతంలో మలక్ పేట అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ముజఫర్ అలీ ఖాన్, చార్మినార్ నుంచి పోటీ చేసిన అలీ బిన్ మస్కతీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై ఎంపీ సీటుకు పోటీ పడ్డ జాహెద్ అలీ ఖాన్ వంటి టీడీపీ నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. బిజెపితో తాము చేతులు కలిపితే ముస్లింలు తమకు ఓటు వేసే అవకాశం ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు లాల్ జాన్ బాషా మృతి తరువాత టీడీపీలో పేరొందిన ముస్లిం నేత మరొకరు కానరావడం లేదు. అలాంటి నేతలను ప్రమోట్ చేయాలన్న ఆలోచన ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. ఇంకొక పెద్ద ముస్లిం నేత బషీరుద్దీన్ బాబూ ఖాన్ 2004 లో బిజెపితో టీడీపీ పొత్తుపెట్టుకోవడాన్ని నిరసిస్తూ పార్టీని, క్రియాశీలక రాజకీయాల్నే వదిలేశారు.
తెలంగాణలోని నిర్మల్, భైంసా, నిజామాబాద్, బోధన్, సంగారెడ్డి, నర్సపూర్, మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్, నారాయణపేట్, తాండూర్, రాజేంద్ర నగర్ వంటి చోట్ల ముస్లిం ఓట్లు చాలా కీలకం. అదే విధంగా సీమాంధ్ర లోని కర్నూలు, కడప జిల్లా, ప్రొద్దటూరు, గుంటూరు, విజయవాడ పాత బస్తీ వంటి చోట్ల కూడా ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బిజెపితో దోస్తీ కోసం వీరందరినీ వదులుకోవడానికి టీడీపీ సిద్ధపడుతోందా అన్నదే ప్రశ్న.
గత ఎన్నికల్లో మలక్ పేట నుంచి పోటీ చేసిన ముజఫర్ అలీఖాన్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలాపై కేవలం 7000 ఓట్లతో ఓడిపోయారు. ఆయన టీడీపీతో 1985 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. చార్మినార్ నుంచి పోటీ చేసిన అలీ బిన్ మస్కతీ దాదాపు 33000 ఓట్లను సంపాదించుకున్నారు. మస్కతీ తండ్రి అబ్దుల్లా బిన్న మస్కతీ టీడీపీ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అసదుద్దీన్ పై పోటీ చేసిన 'సియాసత్' ఉర్దూ పత్రికాధిపతి జాహెద్ అలీఖాన్ తాను ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని మార్చి తొలివారంలోనే ప్రకటించేశారు. ఆయన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో హిందూపూర్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్ గనీ టీడీపీకి ఉన్న ఏకైక ముస్లిం ఎమ్మెల్యే. ఇప్పుడు టీడీపీని నమ్ముకున్న ఈ మైనారిటీ నేతలందరి రాజకీయభవిష్యత్తు గందరగోళంలో పడింది.