జైహింద్ అన్నవాడు....
1941. భారత్ నుంచి రహస్యంగా బయటపడిన సుభాష్ ^è ంద్రబోస్ జర్మనీ చేరుకున్నారు. కోనిస్‌బ్రక్ యుద్ధ ఖైదీల శిబిరాన్ని సందర్శించారాయన. 50,000 మందితో ఒక సైన్యాన్ని నిర్మించి భారత్‌ను ఏలుతున్న వలస ప్రభుత్వం మీద దండెత్తడం సుభాష్ బోస్ ఉద్దేశం. కోనిస్‌బ్రక్ యుద్ధ ఖైదీల శిబిరంలో భారతీయులు ఉన్నారు. వారిలో తను స్థాపించబోయే ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సభ్యులను ఎంపిక చేయడం కూడా ఆయన ఉద్దేశం. కానీ లోపల దృశ్యం వేరుగా ఉంది. తన కన్న కలకు భిన్నంగా ఉంది. అక్కడ ఏ ఒక్కరూ మాతృదేశాన్ని సంకేతించే విధంగా పలకరించుకోవడం లేదు. కొందరు ‘నమస్తే’ లేదా ‘నమస్కారం’ అంటున్నారు. ఇంకొందరు ‘రామ్‌రామ్‌జీ’ అంటున్నారు. సిక్కులు సత్‌శ్రీఅకాల్ అంటున్నారు. ముస్లింలు ‘సలామాలేకుం’ అని పలకరించుకుంటున్నారు. ఎవరో ‘జైరామ్‌జీ కీ’ అన్నారు. అలా కాదు, జాతిజనులు పలకరించుకుంటే అందులో దేశం మాట ధ్వనించాలి. మట్టివాసన గుబాళించాలి. అలాంటి ఒక నినాదం తయారు చేయవలసిందని తన సహచరులకు చెప్పారు సుభాష్ చంద్రబోస్. అందులో తను ఎంతో అభిమానించే మిత్రుడు కూడా ఉన్నాడు. ఆ మిత్రుడు ‘హలో!’ అని పిలుచుకుందాం అన్నాడు. బోస్ ముఖంలో చిరాకు, ఆ మాట విన్నాక. దీనితో ఆ మిత్రుడు కోనిస్‌బ్రక్ యుద్ధ శిబిరానికి వెళ్లాడు. మళ్లీ అవన్నీ విన్నాడు. చివరికి ‘జైరామ్జీకీ’ అన్నమాట అతడికి ప్రేరణ ఇచ్చింది. ఆ పదం ఆధారంగా జై హిందుస్తానీకి’ అని సృష్టించాడతడు. అదే చివరికి ‘జైహింద్’ అన్న అందమైన నినాదంగా రూపుదిద్దుకుంది.
ఆ పదాన్ని సృష్టించినవాడే అబిద్ హసన్ సేఫ్రానీ. నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ వాసి. జైన్ ఉల్ అబిదీన్ హసన్ (జూన్ 11, 1911–ఏప్రిల్ 5,1984) నిజాం సంస్థానం రాజధాని హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి అమర్ హసన్. ఆయన నిజాం రాజ్యంలో కలెక్టర్. తల్లి ఫక్రుల్ హజియా బేగం. ఆమె తీవ్ర బ్రిటిష్ వ్యతిరేకి. నిజాం రాజ్యంలో జాతీయ కాంగ్రెస్ అన్న మాట కూడా వినపడకూడదు. ఇక నాయకులకు ప్రవేశం ఎక్కడిది? అలాంటి కాలంలో హసన్ కుటుంబంలో భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ఉండేది. హజియా ఉద్యమంలో పాల్గొన్నారు. జైన్ ఉల్ అబిదీన్ హసన్ తన పేరును అబిద్ హసన్ అని క్లుప్తంగా చెప్పుకున్నారు. హైదరాబాద్ చరిత్రకారుడు, ఐఎఎస్ అధికారి నరేంద్ర లూధర్, లియోనార్డ్ అబ్రహాం అనే చరిత్రకారుడు జైహింద్ అన్న నినాదాన్ని బోస్ ప్రేరణతో హసన్ ఎలా రూపొందించింది వెలుగులోకి తెచ్చారు. హసన్ హైదరాబాద్‌లోనే సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. ఆయన మీద తల్లి ప్రభావం బలంగా ఉండేదని అర్థమవుతోంది. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి చదువుకు స్వస్తి చెప్పేశారు. గాంధీజీ పిలుపు మేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వానికి ముగ్ధుడై 1931లో సబర్మతి ఆశ్రమానికి వెళ్లి కొద్దిరోజులు అక్కడే ఉన్నారాయన. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంటే అది సాయుధ సమరంతోనే సాధ్యమని హసన్ ఆలోచించడం ఆరంభించారు. ఆ సమయంలో ఇలాంటి ఆలోచనకు వచ్చిన యువకులు భారతదేశంలో చాలా ఎక్కువ. అలాగే తన మిత్రులంతా పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ హసన్ మాత్రం తల్లి ప్రోద్బలంతో ఇంగ్లండ్‌కు కాకుండా ఇంజనీరింగ్ చదువు కోసం జర్మనీ వెళ్లారు. అంతగా ఆ కుటుంబం ఇంగ్లిష్ జాతిని ద్వేషించేది.
1941లో బోస్ జర్మనీ వచ్చారు. ఈ భూప్రంచంలో ఎక్కడ ఉన్నా భారతీయులంతా బోస్‌ను ఒక మహోన్నత యోధునిగా గౌరవిస్తున్న కాలమది. అందుకే ఆయనను జర్మనీలోనే కలుసుకున్నారు హసన్. ‘వెంటనే ఉద్యమంలో చేరు’ అని సలహా ఇచ్చారాయన. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఉద్యమంలో చేరతానని అన్నారు హసన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల వ్యామోహం వీడకపోతే, ఒక మహత్కార్యం వైపు దృష్టి సారించడం ఎప్పటికీ సాధ్యం కాదు అని బోస్ స్పష్టంగానే చెప్పారు. దీనితో ఇంజనీరింగ్ వదిలిపెట్టి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరారు హసన్. బోస్ జర్మనీ రావడం వెనుక పెద్ద పథకమే ఉంది. భారత్‌ను వలస పాలన నుంచి విముక్తం చేయడానికి సైన్యం కావాలి. ఆ సైన్యం గుండె నిండా దేశభక్తి ఉండాలి. మత, కుల భేదాలు ఉండకూడదు. కానీఅప్పటికి ఉన్న బ్రిటిష్ పాలనలోని భారతీయ సైన్యంలో సిక్కు రెజిమెంట్, బలూచీ రెజిమెంట్, రాజపుత్ రెజిమెంట్– ఇలా దళాలు విభజించి ఉండేవి. అలాగే మత విశ్వాసాలను అనుసరించేందుకు ఎవరి స్వేచ్ఛ వారికి ఉండేది. ఆ రోజుల్లో సముద్రయానం చేస్తే హిందూ జీవనం అంగీకరించేది కాదు. కానీ ప్రభుత్వం విదేశాలకు వెళ్లమంటే వెళ్లవలసిందే. ఆ విషయంలో వలస ప్రభుత్వం భారతీయ సిపాయిల విశ్వాసాలకు విలువ ఇచ్చేది కాదు. సముద్రయానం అపవిత్రం అనుకోవడం మూఢత్వమని సుద్దులు చెప్పేది. అలా అని వారి మధ్య నెలకొన్న మత, కుల అంతరాలను రూపుమాపే యత్నం మాత్రం చేయలేదు. నిజానికి పెంచి పోషించిందేమో కూడా.
మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సిపాయిలని ఫ్రాన్స్‌లో ఒక రాజప్రాసాదంలో ఉంచి వైద్యం చేసేవారు. ముంబయ్ తాజ్ హోటల్ని ఆ నాలుగేళ్లు తాత్కాలిక ఆసుపత్రిగా మార్చినట్టు ఆ రాజప్రాసాదాన్ని కూడా తాత్కాలిక ఆసుపత్రిగా ఉపయోగించారు. అక్కడ రెండు మంచినీళ్ల కుళాయిలు ఉండేవి. ఒకటి హిందువుల కోసం. రెండవది ముస్లింల కోసం. అంటే విదేశీ గడ్డ మీద కూడా విశ్వాసాలను మరచిపోయేవారు కాదు.
హిందూ ముస్లిం ఐక్యతకు బలమైన పునాది నిర్మించడమే పునాదిగా లక్నో కాంగ్రెస్ (1916) జరిగింది. బొంబాయి నుంచి జిన్నా, ఇతర నాయకులు, ఆయనకు కాబోయే భార్య ఒక ప్రత్యేక రైలులో లక్నో వెళుతున్నారు. రైలు మధ్య పరగణాలలో ఒక స్టేషన్లో ఆగింది. అక్కడ హిందూ జలం, ముస్లిం జలం అని రాసి ఉందట. ఆఖరికి జర్మనీలో ఉన్న యుద్ధఖైదీల శిబిరంలో కూడా భారతీయ యుద్ధ ఖైదీలు భారతీయులమన్న భావనకు రాలేకపోయారు. వారివారి సంప్రదాయాలను బట్టి, ప్రాంతాలలోని రీతిని బట్టి పలకరించుకునేవారు. ఏ ప్రాంత వారు ఆ ప్రాంతానికి చెందిన వారితోనే కలసి ఉండేవారు. ఇరుగు పొరుగును పట్టించుకునే తత్వం ఉండేది కాదు. అలాంటి సందర్భంలోనే బోస్‌కు దేశమంతటకీ వర్తించే ఒక నినాదం అవసరమన్న ఆలోచన వచ్చింది. ఆ నినాదం వింటే భారతీయులంతా స్పందించాలి.
అబిద్ హసన్ పేరు చివర సేఫ్రానీ అన్న పేరు చేరడం వెనుక కూడా ఆసక్తికరమైన గాథ ఉంది. కలసి భోజనాలు చేయడం, కలసి మెలసి ఉండడం దగ్గర ఉన్న విభేదాలు దేశానికంతటికీ ఒక పతాకాన్ని తయారు చేయడం దగ్గర కూడా తలెత్తింది. హిందువులు కాషాయ పతాకం ఉండాలని కోరారు. ముస్లింలు ఆకుపచ్చ రంగులో పతాకం ఉండాలని పట్టుపట్టారు. కొంత తర్జనభర్జన జరిగిన తరువాత హిందువులు తమ పట్టును వీడి, పతాకం తయారు చేసే స్వేచ్ఛను నాయకత్వానికి వదిలిపెట్టారు. హిందువులు ప్రదర్శించిన ఈ ఔదార్యానికి కృతజ్ఞతగా హసన్, పతాకంలో చోటు ఉండకూడదన్న కాషాయరంగును తన పేరు చివర చేర్చుకున్నారు. ఆ విధంగా అబిద్ హసన్ సేఫ్రానీగా చరిత్ర ప్రసిద్ధులయ్యారు.
తన మాటను మన్నించి వెంటనే ఉద్యమంలో చేరినందుకు హసన్‌కు సుభాష్‌బోస్ సముచిత స్థానమే కల్పించారు. హసన్ రెండేళ్లపాటు బోస్ కార్యదర్శిగా పనిచేశారు. అజాద్ హింద్ ఫౌజ్‌లో ఆయనకు మేజర్ హోదా ఇచ్చారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన 1943 నాటి యుబోటు ప్రయాణంలో బోస్ వెంట హసన్ ఉన్నారు. అలాంటి దాంట్లో రోజుల తరబడి ప్రయాణించి జపాన్ సైన్యం చెప్పిన చోటికి వెళ్లి బోస్ వారిని కలుసుకున్నారు. జపాన్ అధికారులు జలాంతర్గామిలో రావడం విశేషం. ఇంఫాల్‌లో ఐఎన్ఏ చేసిన యుద్ధంలో హసన్ పాల్గొన్నారు. ఇది నాలుగు మాసాల యుద్ధం. 1946లో ఎర్రకోటలో అజాద్ హింద్ ఫౌజ్ మీద విచారణ జరిగింది. హసన్ కొంతకాలం కారాగారం తరువాత విడుదలయ్యారు. కానీ ఆజాద్ హింద్ ఫౌజ్‌తో తన ప్రయాణం గురించి ఆయన బయట ప్రపంచానికి ఏమీ చెప్పలేదు. ఏదీ రాసిపెట్టలేదు. ఇది పెద్ద నష్టమే.
సుభాష్‌బోస్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత హసన్ తన స్వస్థలమైన హైదరాబాద్ వచ్చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. కానీ అప్పటికే ఆ సంస్థలో రాజ్యమేలుతున్న అవాంఛనీయ ధోరణులు సహించలేక కొద్దికాలానికే విడిచిపెట్టారు. బెంగాల్ ల్యాంప్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ కంపెనీ హసన్‌ను కరాచీకి పంపించింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు హసన్. నిజానికి ఆ సమయంలో నిజాం రాజ్యం నుంచి చాలామంది పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయారు. నిజాం కూడా తన విశాల సంస్థానాన్ని పాకిస్తాన్‌లోనే విలీనం చేయాలని శయాథా యత్నించాడు. అలాంటి సమయంలో పాకిస్తాన్ నుంచి హసన్ ఇండియా వచ్చేశారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారత విదేశ వ్యవహారాల విభాగంలో చేరారు. పెకింగ్, కైరోలలో తొలి భారత కార్యదర్శిగా పనిచేసినవారు హసనే. తరువాత బాగ్దాద్, డెమాస్కస్, డెన్మార్క్‌లలో కాన్సల్ జనరల్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో పదవీ విరమణ చేసి మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు.
హసన్ మంచి కవితా ప్రియుడు కూడా. పర్షియన్, ఉర్దూ కవిత్వాల మీద మంచి అభినివేశం కూడా ఉండేది. అందుకే ఆయన జనగణమన అధినాయక జయహే పాటను ఆ భాషలలోకి అనువదించారు. సుభాష్ బోస్ అంటే హసన్‌కు పంచప్రాణాలు. ఎలా జరిగిందో తెలియదు. హసన్ అన్న బద్రుల్ హసన్ కుమార్తె సరయా హసన్ అరవింద్ బోస్ అనే బెంగాలీ యువకుడిని పెళ్లి చేసుకున్నారు. ఆయన సుభాష్ బోస్‌కు స్వయంగా మేనల్లుడు కావడం విశేషం. ఆయన 1948లో జెనీవా వెళుతున్నప్పుడు ఓడలో కలసి ప్రయాణం చేసిన ఒక కుటుంబంలోని బాలిక గీతా డాక్టర్. ఆయనను ఆ వయసు పిల్లలంతా అంకుల్ సేఫ్రాన్ అనే పిలిచేవారట. ఎక్కడ ఓడ ఆగినా మొదట ఆయనే దిగి దగ్గరలోని పట్టణానికి వెళ్లి పిల్లలకు కానుకలు కొని ఇచ్చేవారట. ఓడ బస్రాలో ఆగితే అక్కడ కూడా దిగి ఖరీదైన తివాచీలు కొని తీసుకువచ్చారట. తరువాత ఎప్పుడో ఆమెకు తెలిసిందట– అంకుల్ సేఫ్రాన్ వీరగాధ. తమ త్యాగాలని అంత గుంభనంగా దాచుకున్నారు వారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో తాము పడిన కష్టాల గురించి, తిన్న దెబ్బల గురించి ఆయన ఎప్పుడూ వెల్లడించలేదట. నిజానికి బర్మా నుంచి ఇంఫాల్‌కు జరిగిన సైనిక కవాతులో ఫౌజ్ సిపాయిలు పడిన ఇక్కట్లు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి భారత దేశ ప్రజల గుండెచప్పుడుగా మారిన జైహింద్ సృష్టికర్త తానేనని కూడా ఆయన ఎన్నడూ చెప్పలేదట.
- ∙డా. గోపరాజు నారాయణరావు