ప్రవక్త జీవితం
జైనబ్‌కు యుక్తవయసు రాగానే రబీ కొడుకు అబుల్ ఆస్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి రుఖియ్య, ఉమ్మెకుల్సూమ్ ల వివాహం కూడా అబూలహబ్ కుమారులతో జరిగిపోయింది. ఇక చిన్నారి ఫాతిమా మాత్రమే వారితో ఉంది.
ఒకరోజు బీబీ ఖదీజా తన సోదరుని కొడుకు హకీమ్ బిన్ హిజామ్ దగ్గరికి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు హకీమ్ ఆమెకొక బానిసను ఇచ్చి పంపాడు.
ఈ కొత్త కుర్రాణ్ణి చూసి, ‘ఈ పిల్లాడెవరు?’ అని అడిగారు ముహమ్మద్.
‘అబ్బాయి హకీం సిరియా నుండి కొంతమంది బానిసలను తెచ్చాడట. మనకు కూడా ఒక బానిసను ఇచ్చాడు’ అన్నారు ఖదీజ.
‘ఈ పిల్లాడి ముఖంలో మంచితనం ఉట్టిపడుతోంది. ఎంతో తెలివైనవాడు, వివేకవంతుడు కూడా!’ అన్నారు ముహమ్మద్ .
‘అవునండీ. ఇతను చాలా గారాబంగా పెరిగాడట. యాదృచ్చికంగా బనూఖైన్ వారికి చిక్కాడట. వారు సంతలో అమ్మేశారు’ అన్నారు ఖదీజ.
ఆయన ఆ బానిస బాలుణ్ణి ఎంతో ప్రేమగా తల నిమురుతూ - ‘‘ఇప్పుడీ పిల్లవాడు నా వాడేనా?’ అన్నారు అర్ధాంగినుద్దేశించి చిరునవ్వుతో..
‘అయ్యయ్యో! ఎంతమాట. ఈ బాలుడు మీ బానిసే. ఇప్పుడే ఇతన్ని మీకు అప్పగిస్తున్నాను’ అన్నారామె పరమ సంతోషంతో..
అప్పటికప్పుడు ఆ బాలుడికి బానిసత్వం నుండి విముక్తి కల్పించి, తన కొడుకుగా చేసుకున్నారు. అంతేకాదు, మీ అబ్బాయి జైద్ తన వద్ద క్షేమంగా ఉన్నాడని అతని తల్లిదండ్రులకు కబురు పంపారు.
ఈ కబురు వినగానే జైద్ తండ్రి, అతని బాబాయి ఆఘమేఘాల మీద మక్కా చేరుకున్నారు. ఎంత కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా వాణ్ణి మాకు అప్పగించండి’ అని ప్రాధేయప డ్డారు.
‘మీరింతగా బ్రతిమాలాలా? కన్నప్రేమను నేను అర్థం చేసుకోగలను. అతను మీ వెంట రావడానికి ఇష్టపడితే మీరు బాబును సంతోషంగా తీసుకెళ్ళవచ్చు. రానంటే మాత్రం బలవంతంగా పంపలేను గదా! నన్ను విడిచి పెట్టనివాణ్ణి వదిలెయ్యడం నా పద్ధతి కాదు’ అన్నారు ముహమ్మద్
‘అయ్యో! అంతకంటే మహాభాగ్యం ఏముంది. అలాగే ‘చేద్దాం’ అన్నారు వారు పరమ సంతోషంగా.
అప్పుడు ముహమ్మద్ జైద్‌ను పిలిచి ‘చూడు బాబూ జైద్! మనింటికి ఈ ఇద్దరు అతిథులొచ్చారు. వీళ్ళను నువ్వేమైనా గుర్తుపట్టగలవేమో చూడు’ అన్నారు.
‘మా నాన్న, మా బాబాయి’ ఠక్కున చెప్పాడు బాలుడు.
‘వీళ్ళు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నాన్న వెంట ఇంటికి వెళ్ళు. లేదూ ఉంటాను అంటే నా దగ్గరే ఉండు. బలవంతం ఏమీలేదు. నీ సంతోషమే మా సంతోషం’ అన్నారు ముహమ్మద్
జైద్ వెంటనే ముహమ్మద్‌ని వాటేసుకొని - నేను వెళ్ళను. నేను మీ దగ్గరే ఉంటాను’ అని ఏడుపు లంకించుకున్నాడు.
దీంతో ‘తల్లిదండ్రుల్ని, చుట్టాలు పక్కాల్ని, సొంత ఊరిని అందరినీ విడిచి పెట్టి ఇక్కడే బానిసలా బతుకుతానంటావేంట్రా!’ అంటూ మండిపడ్డాడు తండ్రి.
‘ఇక్కడ నేను బానిసలా ఏమీ లేను. సొంత కొడుకులా చూసుకుంటున్నారు. సంతోషంగా ఉన్నాను. ఇంతటి మంచి వారిని నేను వదులుకోలేను’ అన్నాడు జైద్.
ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)