లఖ్వీకి జైలే గతి!
హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసిన పాక్ సుప్రీంకోర్టు
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్తాన్ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతడి నిర్బంధ ఉత్తర్వులు చెల్లవంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. కేసును మరోసారి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో లఖ్వీకి మరికొద్ది రోజులు జైలు తప్పని పరిస్థితి ఎదురైంది.
‘‘ఇస్లామాబాద్ హైకోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో ప్రభుత్వ వాదనలను ఏమాత్రం వినలేదు. అందుకే కేసును తిరిగి ఆ కోర్టుకే పంపుతున్నాం. ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆ న్యాయస్థానం ఓ నిర్ణయానికి రావొచ్చు’’ అని జస్టిస్ ఖ్వాజా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. భద్రతా కారణాలు చూపుతూ లఖ్వీని నిర్బంధించడం చెల్లదంటూ డిసెంబర్ 29న ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కరుడుగట్టిన ఉగ్రవాది విడుదలకు మార్గం సుగమం చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దీంతో పాక్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. హైకోర్టు తీర్పును అప్పీలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కాగా లఖ్వీకి బెయిల్ మంజూరు చేస్తూ డిసెంబర్ 18న ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇచ్చిన తీర్పుపైనా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. మంగళవారం ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం లఖ్వీకి నోటీసులు జారీ చేసింది.