బ్రహ్మపుత్రపై చైనా భారీ ఆనకట్ట!
బీజింగ్: భారత్ ఆందోళనను బేఖాతరు చేస్తూ బ్రహ్మాపుత్ర నదిపై చైనా నిర్మించిన భారీ జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు మంగళవారం నుంచి పనిచేయడం ప్రారంభించింది. టిబెట్ ప్రాంతంలో 1.5 బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ డ్యామ్ తో.. దిగువన నివసించేవారి ప్రాణాలకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్టులోని మొత్తం ఆరు యూనిట్లను మంగళవారం పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అతి పెద్ద హైడ్రోపవర్ కాంట్రాక్టర్ అయిన చైనా గెఝౌబ్ గ్రూప్ నిర్మించిన ఈ జామ్ హైడ్రో పవర్ స్టేషన్ గ్యాకా కౌంటీలో ఉంది.
టిబెట్‌లో యార్లంగ్ జాంగ్బో నదిగా పిలిచే బ్రహ్మపుత్ర టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా పేరొందిన ఈ ప్రాజెక్టు సంవత్సరానికి 2.5 బిలియన్ కిలోవాట్ హవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రాజెక్టుపై భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభ సమయంలో ఆ డ్యామ్ నుంచి ఒకేసారి విడుదల చేసే నీటి ఉధృతి వల్ల దిగువ ప్రాంతాలలో వరదముప్పు తలెత్తే అవకాశముందని పేర్కొంది.