Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Trump Says Russia Lost Major Oil Client India New Delhi Reaction Is1
రష్యా చమురుకి భారత్‌ దూరమైంది: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ‍వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్‌ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్‌పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ట్రంప్‌ ఉక్రెయిన్‌ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్‌న్యూస్‌కు ట్రంప్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్‌ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్‌ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్‌పై ట్రంప్‌ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్‌ రష్యా ఆయిల్‌ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్‌ 50 శాతం సుంకాలను భారత్‌ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్‌ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్‌లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) చైర్మన్‌ ఏఎస్‌ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్‌ 50 శాతం టారిఫ్‌ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్‌​ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్తాన్‌ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్‌ ఆయిల్‌ను స్పాట్‌ మార్కెట్‌ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్‌, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం.

Kommineni Srinivasa Rao Comments On Vontimitta ZPTC ByElection 2
మైమరచిన పచ్చమీడియా!

1983లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడు ఆ పార్టీ అభిమానులు కొంతమంది కనిపించిన ఈనాడు జర్నలిస్టులందరికీ పూలదండలు వేసి సత్కరించారు. ఈనాడు పత్రిక ఆఫీస్ గేటుకు కూడా పూలమాలలు కట్టి వెళ్లేవారు. ఇదెక్కడి గొడవ! ఎంత టీడీపీకి సపోర్టు చేసినా, ఇలా మెడలో బొమికలు వేసుకున్నట్లుగా పరిస్థితి ఏర్పడిందేమిటా అని కొందరు సీనియర్ జర్నలిస్టులు బాధపడేవారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏపీలో ఏర్పడడం అత్యంత విచారకరం. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నకలలో టీడీపీకి చాలా కష్టపడి గెలిపించిన కొంతమంది పోలీసు అధికారులకు, జిల్లా ఎన్నికల యంత్రాంగ ముఖ్యులకు టీడీపీ నేతలు సన్మానం చేసి ఉండాలి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మద్దతు మీడియా యజమానులకు, జర్నలిస్టులకు కూడా సత్కారాలు జరిగి ఉండాలి. ఆ టీడీపీ మీడియా కార్యాలయాలలో స్వీట్స్ కూడా పంచుకుని ఉంటారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అదో రకం. కాని రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా గెలవడంపై కూడా ఇంత సంబరపడాలా అని టీడీపీ క్యాడరే విస్తుపోతోంది. ఎందుకంటే గెలిచింది టీడీపీ కాదని, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ అధికారులన్నది ప్రజలందరికి తెలిసిన సత్యం. టీడీపీ అధినాయకత్వం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణ అధికారులు, ఎన్నికల కమిషన్, టీడీపీకి మద్దతిచ్చే మీడియా .. ఇలా అందరికి తెలుసు వాస్తవం ఏమిటో! అయినా వారు జనాన్ని మోసం చేయడానికి తమ వంతు కృషి చేశారనిపిస్తుంది. ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీ ఓడినట్లు భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడ్డారు. వైకాపాకు ఘోర పరాభవం అంటూ ఈనాడు మీడియా శీర్షిక పెట్టింది. నిజానికి పరాభవం జరిగింది ప్రజాస్వామ్యానికి. అయినా ఆత్మవంచన చేసుకుని వార్తలు ఇచ్చారు. అందులో పులివెందులను, వైఎస్ కుటుంబాన్ని ఒక భూతంగా చూపించడానికి ఆ మీడియా చేసిన ప్రయత్నం గమనిస్తే సంబంధిత జర్నలిస్టులపై అసహ్యం కలుగుతుంది. మరో విధగా చూస్తే ఇంత కట్టుబానిసలుగా మారారా అని జాలి కలుగుతుంది. ముప్పై ఏళ్లలో తొలిసారి ఓటు వేశానని ఎవరో ఒకరు స్లిప్ వేశారట. అది అసత్యమే అయినా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అందరూ ప్రచారం చేశారు. ఈ ముప్పై ఏళ్లలో సగం కాలం ఆయనే పాలన చేశారు. దానిని బట్టి ఆయన సమర్థంగా పరిపాలన చేయలేదని ఒప్పుకుంటున్నారా? ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు. కాని పులివెందులలో రాక్షసులు ఉంటారన్నట్లుగా ప్రచారం చేసి ఒక ప్రాంత ప్రజలను అవమానించడానికి టీడీపీతోపాటు ఈ మీడియా వెనుకాడడం లేదనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి దొంగ ఓట్లు వేయిస్తుంటారని చెబుతారు. గతంలో అక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా పోటీచేసిన చంద్రమౌళి అనే దివంగత రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి ఎంత ప్రయత్నించినా, సాధ్యపడలేదని అనేవారు. దాని గురించి ఎన్నడైనా ఈ మీడియా ఒక్క వార్త రాసిందా? కొన్ని దశాబ్దాలుగా పులివెందుల ప్రశాంతంగా ఉంటోందని, చాలావరకు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటిది మళ్లీ ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం వేళ్లూనుకునేలా ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించడం ఎంత దారుణం? స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒకప్పుడు పోలీసులు ప్రజలకు చెప్పేవారు. ర్యాలీలు తీయించేవారు. అలాంటిది ఓటు వేయడానికి వచ్చిన వారిని ఓటు వేయనివ్వకుండా చేసిన గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. చివరికి ప్రజలు తమ ఓటు తమను వేసుకోనివ్వండి అని పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన కూడా దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. ఇది కూడా గొప్ప విషయమే అని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈ మీడియా మురికి మీడియాగా మారిందన్న విమర్శలకు గురి అవుతోంది. పోలింగ్ బూత్ లను మార్చేయడం, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తరిమేయడం, పొరుగున ఉన్న జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ నేతలు తమ కార్యకర్తలను తరలించి దొంగ ఓట్లు వేయించడం, వైఎస్సార్‌సీపీ వారిపై దాడులకు తెగపడడం వంటివి చూస్తే ప్రభుత్వమే ప్రజాస్వామ్యానికి పాతర వేసినట్లనిపిస్తుంది. అలాంటి వారికి అండగా నిలబడ్డ పోలీస్ అధికారులకు టీడీపీ నాయకత్వం ఎంతగా సన్మానించినా తప్పు ఉండకపోవచ్చు.స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బూత్ పరిశీలన సమయంలోనే జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగ ఓటర్లు దర్జాగా ఓటు వేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం ఎంత బాగా పని చేసింది తెలిసిపోతుంది. దీనిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్ ఫోటోలతోసహా చూపించడంతో కలెక్టర్ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించుకున్నారే కాని, అలా దొంగ ఓట్లు వేసిన వారిపై చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించలేదే. ఇలాంటి అధికార యంత్రాంగానికి కూడా టీడీపీ నేతలు రుణపడి ఉండవచ్చు. వైఎస్సార్‌సీపీ వారి ఎన్నికల ప్రచారాన్ని పత్తాపారం అంటూ పోల్చి, టీడీపీ వారి దౌర్జన్యాలకు అండగా నిలబడ్డ పోలీస్ అధికారులను బహుశా టీడీపీ అధినాయకత్వం శహభాష్ అని మెచ్చుకుని ఉండాలి.ఇలాంటి వారందరికి డబుల్ ప్రమోషన్ లు కూడా వస్తాయోమే చూడాలని టీడీపీ నేతలే కొందరు చమత్కరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్లు వేయించిన నేతలు తెలివితక్కువగా వ్యవహరించారని టీడీపీ నాయకత్వ ఫీల్ అవుతోందట. వైఎస్సార్‌సీపీకి, వైఎస్ జగన్ కు బలమైన పులివెందుల మండలంలో మరీ ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా ఓట్లు రిగ్ చేయడం వల్ల ఫలితాలను ప్రజలు ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినాయత్వం అసహనం వ్యక్తం చేసిందట. మంచి మెజార్టీతో గెలిచేలా రిగ్గింగ్ చేయండని చెబితే వీరు మితిమీరిన ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అప్రతిష్ట వచ్చిందని భావించి ఉండాలి. రిగ్గింగ్ చేసేటప్పుడు వైఎస్సార్‌సీపీకి కూడా గణనీయంగా ఓట్లు వేసి ఉంటే ప్రజలు నిజంగానే వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందేమోలే అనుకునేవారని, అలా చేయకపోవడంతో టీడీపీ అసలు రంగు బయట పడిపోయిందని ఆ పార్టీ నేతలు కొంతమంది వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి దిమ్మతిరిగే ఫలితం అని మరో టీడీపీ మీడియా రాసింది. అవును..అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని,అరాచకం చేస్తే వైఎస్సార్‌సీపీకి కాదు దిమ్మతిరిగేది.. రాష్ట్ర ప్రజలకు.ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతోందా అన్న విషయం ప్రజలందరికి అర్థమైపోయింది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటికి జగన్‌పై ద్వేషం ఉంటే ఉండవచ్చు. కాని ఆయనపై కోపంతో ఈ మీడియా సంస్థల అధినేతలు తమ దుస్తులు తామే ఊడదీసుకుని నగ్నంగా బజారులో నిలబడి నవ్వులపాలవుతున్న సంగతిని విస్మరిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వాటి పని అవి చేయకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో, ప్రజలలో ఎంత అపనమ్మకం ఏర్పడుతుందో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాటి చెప్పాయి.ప్రభుత్వ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ, ఒక వర్గం మీడియా వ్యవస్థ అన్ని కుమ్మక్కై ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఈ పరిస్థితి నుంచి కాపాడుతుందని భావించిన న్యాయ వ్యవస్థ కూడా అలా చేయలేకపోయిందన్న బాధ చాలా మందిలో ఉంది.ప్రభుత్వం నిజాయితీగా ఎన్నికలు జరిపించి ఉంటే ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే అవకాశం వచ్చేది.అయినా బుల్‌ డోజ్ చేసి తమ ఎల్లో మీడియా మద్దతుతో ఏమి చేసినా జనం నమ్ముతారులే అనుకుంటే అది భ్రమే అవుతుంది. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఇలాగే చంద్రబాబు అరాచాకాలు చేయించి గెలిచారు. కాని సాధారణ ఎన్నికలలో టీడీపీ అంతకు రెట్టింపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌ ప్రమేయం ఈ ఎన్నికలలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన సంబరపడిపోతే అది ఆయన అమాయకత్వమే అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి వంతపాడి ఆయన ఎంత దీన పరిస్థితిలో ఉంది తెలియచేసినట్లయింది. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కోరిన వెంటనే కేవలం ఈ రెండిటికే ఎన్నికలు పెట్టడం, అక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కళ్లుమూసుకుని కూర్చోవడం, కనీసం అధికార యంత్రాంగాన్ని మందలిచే ధైర్యం చేయకపోవడం వల్ల, ప్రభుత్వంలోని వారెవరైనా ఎన్నికల కమిషనర్‌ను బెదిరించారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, ఇతర ఎన్నికల యంత్రాంగం అసలు ఓటర్లకు కాకుండా నకిలీ ఓటర్లకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం ద్వారా తమ హోదాకు తామే అవమానం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ వారిని రకరకాలుగా కట్టడి చేయడం, టీడీపీ వారిని ఇష్టారాజ్యంగా తిరిగేలా స్వేచ్చనివ్వడం ద్వారా, పోలీస్ యంత్రాంగం ఏపీలో ఎంత దారుణంగా పనిచేస్తున్నది లోకానికి చాటి చెప్పినట్లయింది. గౌరవ హైకోర్టు ఈ అక్రమాలు కొన్నిటిని గుర్తించినట్లు వ్యాఖ్యలు చేసినట్లు అనిపించినా, అంతిమంగా సాంకేతిక కారణాలతో జోక్యం చేసుకోలేమని చెప్పడం బాధాకరమే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి హైకోర్టు మరింత చొరవ తీసుకుని ఉంటే దేశానికే ఒక సందేశం ఇచ్చినట్లయ్యేదేమో! ఏమైతేనేమి అన్ని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఓటమికి కారణం అయ్యాయనుకోవాలి.ఇది దేశానికి మంచిదా?కాదా?అన్నది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Social media Reaction For Putin Reactions At Alaska Talks Viral3
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్‌.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్‌ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్‌ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్‌ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్‌ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్‌ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్‌ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించగా.. దానికి పుతిన్‌ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్‌ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్‌ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్‌ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్‌ కుదర్చాలని ట్రంప్‌ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్‌ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్‌ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా ‍వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్‌ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్‌ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్‌.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్‌ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్‌ పీస్‌ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్‌-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్‌ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్‌ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్‌ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్‌ మీడియా చానెల్స్‌ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్‌ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్‌ చాలా టఫ్‌, స్ట్రాంగ్‌ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్‌స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్‌-పుతిన్‌ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్‌ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్‌​ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది.

Sri Sathya Sai District Dharmavaram Man Arrest By NIA Amid Terror Links4
ఉగ్ర లింకులతో ఉలిక్కిపడ్డ ధర్మవరం

సాక్షి, అనంతపురం: సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) స్థానికంగా ఓ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పట్టణం ఉలిక్కిపడింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్‌(40).. స్థానికంగా ఓ హోటల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అతని కదలికలు అనుమానంగా ఉండ సాగాయి. ఉగ్రవాదులతో అతను వాట్సాప్‌ కాల్‌ మాట్లాడినట్లు ఎన్‌ఐఏ అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ క్రమంలో అతని సోషల్‌ మీడియా అకౌంట్లనూ తనిఖీ చేశారు. వీటి ఆధారంగా.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు.. నూర్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. 16 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

No Sanju Tilak Rinku: Harbhajan Singh Picks His Asia Cup 2025 Squad5
ఆసియా కప్‌-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్‌లకు నో ఛాన్స్‌!

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముగించుకున్న భారత క్రికెట్‌ జట్టు తదుపరి ఆసియా కప్‌-2025 (Asia Cup)కి సన్నద్ధం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 మధ్య టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.గిల్‌, జైసూ, శ్రేయస్‌ రైట్‌ రైట్‌ఈ నేపథ్యంలో.. వరల్డ్‌కప్‌ చాంపియన్‌, టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆసియా కప్‌ టోర్నీకి తన జట్టును ప్రకటించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌నే సారథిగా కొనసాగించాలన్న భజ్జీ.. టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gil)తో పాటు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)ను కూడా ఈ టోర్నీలో ఆడించాలని బీసీసీఐకి సూచించాడు.సంజూ వద్దు.. రిషభ్‌ ముద్దుఅదే విధంగా.. వీరితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంజూ శాంసన్‌ను భజ్జీ పక్కనపెట్టాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ మంచి ఆప్షన్‌ అని.. అయితే, తాను మాత్రం రిషభ్‌ పంత్‌కే ఓటు వేస్తానని హర్భజన్‌ సింగ్‌ స్పష్టం చేశాడు.రియాన్‌ పరాగ్‌కు చోటు.. రింకూకు మొండిచేయిఇక పేస్‌ దళంలో నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు భజ్జీ స్థానం ఇచ్చాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రియాన్‌ పరాగ్‌లను హర్భజన్‌ ఎంపిక చేశాడు. ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు కూడా భజ్జీ తన జట్టులో చోటిచ్చాడు.ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మను కొనసాగించాలన్న భజ్జీ.. అతడికి జోడీగా సంజూను కాదని యశస్వి జైస్వాల్‌ను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో తిలక్‌ వర్మను కాదని శుబ్‌మన్‌ గిల్‌కు ఓటేశాడు. ఇక నయా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్‌కు కూడా భజ్జీ మొండిచేయి చూపాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ హర్భజన్‌ సింగ్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కఠినమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస శతకాలు బాదిన కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌, హైదరాబాదీ తిలక్‌ వర్మలను భజ్జీ పక్కన పెట్టడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. గిల్‌, జైసూల టీమిండియా టీ20 రీ ఎంట్రీ కోసం సౌత్‌ ప్లేయర్లపై వేటు వేయాలనడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.ఆసియా కప్‌-2025కి హర్భజన్‌ సింగ్‌ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్‌, అభిషేక్ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్‌ పంత్‌/కేఎల్‌ రాహుల్‌, రియాన్‌ పరాగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌.చదవండి: సంజూ శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

Bigg Boss 9 Agnipariksha: Abhijeet Promo Released6
అగ్నిపరీక్ష.. ఏంటిది? బిగ్‌బాస్‌ వాయిస్‌ తేడాగా ఉందే!

ప్రతి ఏడాది బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show) వస్తుంది. అది కామన్‌.. కానీ, ఈసారి బిగ్‌బాస్‌ కంటే ముందు అగ్నిపరీక్ష వస్తోంది. సామాన్యులను సెలక్ట్‌ చేసే ప్రోగ్రామ్‌ ఇది. ఏదో ఆషామాషీగా కాకుండా ఎంతో ఘనంగా ఈ అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌ను జరిపించనున్నారు. దీనికి బిగ్‌బాస్‌ మాజీ విన్నర్స్‌ అభిజిత్‌ (Abhijeet), బిందు మాధవి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నవదీప్‌ జడ్జిలుగా వ్యవహరించనున్నారు.నా తడాఖా చూపిస్తా!తాజాగా పెద్దపులి అభిజిత్‌ మళ్లీ వచ్చాడంటూ హాట్‌స్టార్‌ ఓ ప్రోమో రిలీజ్‌ చేసింది. అందులో అభిజిత్‌ మాట్లాడుతూ.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చిన నన్ను.. ఈరోజు మళ్లీ జడ్జిగా పిలిచారు.. థాంక్యూ! ఇప్పటిదాకా నన్ను స్వీట్‌ చాక్లెట్‌ బాయ్‌గానే చూశారుకదా.. ఈ ఆగస్టు 22 నుంచి నా జడ్జిమెంట్‌ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్‌బాస్‌తో సహా వాళ్లకూ (కంటెస్టెంట్స్‌కు) చూపిస్తా.. అన్నాడు. అయితే ఈ వీడియోలో బిగ్‌బాస్‌ వాయిస్‌ మారింది. గంభీరంగా వినిపించే బిగ్‌బాస్‌ గొంతుక పేలవంగా మారిపోయింది. గొంతు మారిపోయిందిమరి ఇది ప్రోమో వరకేనా? లేదా అగ్నిపరీక్ష షోలో, బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో కూడా ఇదే గొంతు వినిపిస్తుందా? అని చాలామంది డౌట్‌ పడ్డారు. దీంతో హాట్‌స్టార్‌ ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. ప్రమోషన్స్‌ కోసమే ఈ కొత్త వాయిస్‌ వాడామని, బిగ్‌బాస్‌ షోలో పాత గొంతే వినిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఇకపోతే అగ్నిపరీక్ష.. ఆగస్టు 22 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షలో సెలక్ట్‌ అయిన కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ 9లో కామనర్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. The Peddha Puli @Abijeet roars Back! 🦁This time, not as a contestant, but as the formidable Judge of Bigg Boss Agnipariksha! A true test to crack. ⌛#BiggbossTelugu9 Agnipariksha starts from August 22nd exclusively on JioHotstar #BiggbossTelugu9#BiggbossAgnipariksha… pic.twitter.com/IXOzs4xyzZ— JioHotstar Telugu (@JioHotstarTel_) August 16, 2025 చదవండి: అందం ఒక్కటే కాదు.. కలర్‌ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్‌

some practical legal tips to safeguard your property7
కబ్జాసురుల పాపం పండేలా..

కుమార్‌ తన ఫ్యామిలీతో కలిసి వరంగల్‌లో ఉండేవాడు. తన తండ్రి ఓ చిన్న సంస్థలో పని చేస్తుండేవాడు. తల్లి హౌస్ వైఫ్. వారి కుటుంబ సంపాదన చాలా తక్కువగా ఉన్నా కుమార్‌ భవిష్యత్తు బాగుండాలని పేరెంట్స్ ఇద్దరు కొన్నిసార్లు పస్తులున్నా కుమార్‌ను బాగా చదివించారు. కుమార్‌ కూడా పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని బాగా చదివి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తాను జాబ్‌లో చేరిన తర్వాత స్కిల్ సెట్ బావుండడంతో కెరియర్‌లో ఎదిగాడు. కుమార్‌కు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది.. తన బాల్యం మొత్తం కేవలం రెండు గదుల ఇంటిలోనే ఉన్నాడు. ఇ‍ప్పటికీ తన పేరెంట్స్‌ అందులోనే ఉంటున్నారు. దాంతో వారిని వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో సొంత ఇల్లు కట్టి అందులోకి తీసుకురావాలని అనుకున్నాడు. తన నెలసరి సంపాదనలో ఖర్చులు పోగా పేరెంట్స్‌కు కొంత డబ్బు పంపించి మిగులు జీతాన్ని క్రమశిక్షణతో పొదుపు చేస్తూ వచ్చాడు. ఆరేళ్లపాటు చాలా మంచి కార్పస్‌ను సృష్టించాడు.ఈలోపు కుమార్‌ పని చేస్తున్న కంపెనీ తన కష్టాన్ని గుర్తించి ఆన్‌సైట్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ ఆఫర్ వల్ల తన సంపాదన మరింత పెరుగుతుంది. ఒకరోజు ప్లాట్స్‌ సేల్‌ అనే యాడ్‌ చూశాడు. వెంటనే వెళ్లి తన దగ్గర ఉన్న సేవింగ్స్‌తో ప్లాట్ కొనేద్దాం అనుకున్నాడు. ఆన్‌సైట్‌కి వెళ్లి బాగా డబ్బు సంపాదించి తిరిగి వచ్చాక ఆ సైట్‌లో ఇల్లు కట్టి తన పేరెంట్స్‌ను హైదరాబాద్‌ తీసుకొద్దాం అనుకున్నాడు. దాంతో ఒకరోజు ఆ ల్యాండ్ చూడడానికి వెళ్లాడు. తనకి అది నచ్చి దాన్ని కొనుగోలు చేశాడు. కుమార్‌ ఆన్‌సైట్‌ వెళ్లేముందు వరంగల్‌లోని తన పేరెంట్స్ వద్దకు వెళ్లి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వారి చేతిలో పెడుతూ ‘నాన్న ఇప్పటివరకు సేవ్ చేసిన డబ్బుతో మంచి ప్లాట్ ఒకటి కొన్నాను. నేను యూఎస్‌ నుంచి తిరిగి రాగానే అందులో కన్‌స్ట్రక్షన్‌ పనులు మొదలు పెడదాం. త్వరలోనే మన సొంత ఇంటి కల నెరవేరబోతుంది నాన్న’ అన్నాడు.యూఎస్‌ వెళ్లిన కుమార్‌ వృథా ఖర్చులకు పోకుండా, డబ్బు బాగా సంపాదించి క్రమశిక్షణతో సేవ్‌ చేశాడు. తాను ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత గతంలో తీసుకున్న ల్యాండ్‌లో కన్‌స్ట్రక్షన్‌ మొదలు పెట్టాలనుకుని కుమార్‌, తన తండ్రి హైదరాబాద్‌లోని ప్లాట్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి ప్లాట్‌లో ఇప్పటికే ఎవరో కన్‌స్ట్రక్షన్‌ ప్రారంభించారు. ఆ నిర్మాణం చేస్తున్న వారిని నిలదీయడంతో అది తమ ప్లాట్ అని, అందుకే కన్‌స్ట్రక్షన్‌ మొదలు పెట్టినట్లు చెప్పారు. కుమార్‌కు తన ప్లాట్ కబ్జాకు గురైందని అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇది సివిల్ కేసు.. కోర్టులో కేసు ఫైల్ చేయాలని చెప్పడంతో తగిన డాక్యుమెంట్స్‌తో కోర్టుకు వెళ్లాడు. ఆ అక్రమ కన్‌స్ట్రక్షన్‌ ఆపాలని, న్యాయబద్ధంగా తన ప్లాట్ పొజిషన్ తనకి ఇప్పించాలని వేడుకున్నాడు. ఆ కన్‌స్ట్రక్షన్‌ ఆపేందుకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది. కుమార్‌ ఆ నిర్మాణాన్ని అయితే ఆపగలిగాడు కానీ, తన పొజిషన్ పొందాలంటే అది వెంటనే అయ్యే పనికాదు. సివిల్ కోర్టులో ఇలాంటి కేసులు కొన్ని సంవత్సరాల పాటు నడుస్తాయని అందిరికీ తెలిసిన విషయమే.ఆ కుటుంబం సొంత ఇంటికలా చెల్లాచెదురైంది. కుమార్‌కు జరిగిన మోసం కొంతమందికే జరుగుతుందని అనుకుంటున్నారేమో.. రీసెంట్ టైమ్‌లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రాపర్టీ ధరలు అధికమవుతుంటే ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ప్లాట్లని, ఖాళీ స్థలాలను మాత్రమే కబ్జా చేస్తారని కొందరు భావిస్తుంటారు. కన్‌స్ట్రక్షన్‌ పూర్తయి ఖాళీగా ఉన్న ఇల్లుని కూడా కొట్టేయడానికి కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. అంతవరకు ఎందుకు మనం సరైన నిబంధనలు పాటించకుండా ఇల్లు అద్దెకి ఇస్తే కొందరు టెనెంట్లు ఆ ప్రాపర్టీని కొట్టేయడానికి యత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. మొత్తంగా కోటి పది లక్షల సివిల్ కేసులు రిజిస్టర్ అయితే సంవత్సరంపైగా పెండింగ్‌లో ఉన్న కేసులు 73% పైనే. తెలుగు రాష్ట్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో 4,23,000కు పైగా సివిల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో 3,49,000కు పైగా సివిల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్ని ప్రాపర్టీ రిలేటెడ్ కేసులు అవ్వకపోయినా అధిక భాగం అవే ఉన్నాయి.ప్లాట్‌ కొన్న తర్వాత ఏం చేయాలంటే..ఓపెన్ ప్లాట్ కొన్నప్పుడు అందులో రాళ్లు పాతిపెట్టి ఉండడం గమనిస్తాం. సాధారణంగా ఆ స్థలాన్ని అలాగే వదిలేస్తాం. అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కబ్జాదారులకి, ఎంక్రోచ్‌మెంట్‌కు మనమే అవకాశం ఇచ్చినవారమవుతాం. దీన్ని కట్టడి చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.ఎవరైతే తరచూ తమ ల్యాండ్‌ను గమనిస్తుంటారో వారు ఓపెన్‌ప్లాట్లు తీసుకోవచ్చు. కొన్న తర్వాత రెగ్యులర్‌గా దాన్ని చెక్ చేస్తుండాలి.నిత్యం ల్యాండ్‌ను పరిశీలించాలంటే కొందరికి కుదరకపోవచ్చు. అలాంటివారు మాత్రం ఓపెన్ ప్లాట్ కొనే దానికన్నా గేటెడ్ కమ్యూనిటీలోని ప్లాట్స్ తీసుకుంటే కొంతవరకు మేలు.ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేసినా దాన్ని కాపాడుకునేందుకు కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లాట్ చుట్టూ సరిహద్దులను ప్రాపర్‌గా చెక్ చేసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్‌ వేయాలి.ఇంకొంచెం ఇన్వెస్ట్‌ చేయగలిగితే కాంపౌండ్ గోడ కట్టి చిన్న గేట్ పెట్టుకోవచ్చు. ఇది కబ్జాల నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది.భూకబ్జాలో ఎంక్రోచ్‌మెంట్‌ మరో రకమైన విధానం. అంటే పక్కవారు మీ ల్యాండ్‌ను కొంచెంకొంచెంగా ఆక్యుపై చేసేస్తుంటారు. అలాంటి వారి నుంచి కంపౌండ్‌ గోడ ప్రొటెక్ట్ చేస్తుంది.ఫెన్స్ వేసి గేట్‌ పెట్టిన తర్వాత సైన్ బోర్డ్స్ పెడితే మరింత బెటర్‌. చాలా ప్రాపర్టీస్‌ ముందు ‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దిస్‌ పర్సన్. ట్రెస్‌పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్’ అని కాంటాక్ట్‌ నంబర్‌ ఉండేలా సైన్ బోర్డ్స్ చూస్తూనే ఉంటాం. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి విధానం చాలా ముఖ్యం.ఇలాంటి సైన్‌బోర్డ్‌ పెడితే 100 శాతం మన ల్యాండ్‌ను ఎవరూ కబ్జా చేయరా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఇది అవతలి వారి ప్రాపర్టీని బలవంతంగా కొట్టేద్దామని ప్రయత్నించేవారికి హెచ్చరికలా మాత్రం పని చేస్తుంది.చివరగా మనం ఆస్తులు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంతే ముఖ్యమని గమనించాలి. బయట ఎక్కడో యాడ్‌ చూసి ప్రాపర్టీ కొనేముందు.. డేట్‌ కనిపించేలా ఆ యాడ్‌ వివరాలు రికార్డు చేసి పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా ఇష్యూ వస్తే ఆ తేదీ వరకు సదరు ల్యాండ్‌ కబ్జా కాలేదని నిరూపించేందుకు ఒక ప్రూఫ్‌లా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబన

Asian Paints intraduces Lotus Effect Technology Apcolite All Protect8
కోహ్లీ కొత్త క్యాంపెయిన్‌.. ఎందుకంటే..

ఇంట్లో గోడలకు సాధారణంగా మరకలు పడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కవ కష్టపడాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఏషియన్‌ పెయింట్స్‌ కొత్త టెక్నాలజీ ఉపయోగించి నూతన రంగులను తయారు చేస్తున్నట్లు తెలిపింది. తన రంగుల్లో లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో పని చేసే ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ అనే సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేస్తున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ చెప్పింది.ఈ అత్యాధునిక ప్రీమియం ఇంటీరియర్ పెయింట్స్ మెరుగైన స్టెయిన్ రిపెల్లెన్సీ, ఫ్లేమ్ రెసిస్టెన్స్‌, మెరుగైన సౌందర్యాన్ని అందిస్తాయని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. దీన్ని వినియోగదారుల ఆధునిక జీవనం కోసం రూపొందించిన్నట్లు పేర్కొంది. గతంలో ఏషియన్‌ పెయింట్స్‌ అల్టిమా ప్రోటెక్ట్‌ ద్వారా గోడల లామినేషన్ ప్రొటెక్షన్ కోసం గ్రాఫీన్‌ను ఉపయోగించింది. రాయల్‌ వేరియంట్‌లో టెఫ్లాన్ ఆధారిత స్టెయిన్ రెసిస్టెన్స్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా ఏషియన్‌ పెయింట్స్‌ ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్‌లో అధునాతన లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు తెలిపింది.సహజంగా శుభ్రపరుచుకునే సామర్థ్యాలు కలిగిన తామర ఆకు నుంచి ప్రేరణ పొంది లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని రూపొందించినట్లు ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇంటి గోడలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రోజువారీ మరకలు కనిపించకుండా లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీ పని చేస్తుంది. కాఫీ, సాస్‌, క్రేయాన్లు.. వంటి మరకలు గోడపై ఉన్నప్పుడు చాలా తక్కువ శ్రమతోనే వాటిని శుభ్రం చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇది సమకాలీన భారతీయ గృహాలకు అనువైన పరిష్కారంగా ఉంది. ఈ పెయింట్ ఫ్లేమ్ రెసిస్టెన్స్‌ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇంట్లో సువాసనలను సైతం వ్యాపింపజేస్తుంది. మాట్, షైన్ ఫినిషింగ్ రెండింటిలోనూ ఈ రంగులు లభిస్తాయి. ఆరు సంవత్సరాల వారంటీతోపాటు మన్నిక, సంరక్షణ అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ..‘ఏషియన్ పెయింట్స్‌లో గృహాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి మేము చాలా సమయం వెచ్చిస్తాం. నేటి వినియోగదారులకు నిజంగా అవసరమైన వాటి చుట్టే మా ఆవిష్కరణలు ఉంటాయి. వేడుకలు, పిల్లలు, పెంపుడు జంతువులు, దైనందిన కార్యక్రమాలతో నేడు ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ దాని లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో మేము ఈ వాస్తవికతకు సరిపోయే పరిష్కారాన్ని సృష్టించాం. ఇది గోడలను శుభ్రంగా ఉంచి ఒత్తిడిని తొలగిస్తుంది. దాని ఉత్తమ స్టెయిన్ రిపెల్లెన్సీకి ధన్యవాదాలు. ఇది తెలివైన, మరింత అప్రయత్నమైన జీవనం వైపు సాగే అడుగు. ఇక్కడ గృహాలు సొగసైనవి. రోజువారీ దుస్తులను సులభంగా హ్యాండిల్ చేస్తాయి’ అని చెప్పారు.ఏషియన్‌ పెయింట్స్‌ బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ దీనికి మద్దతు ఇస్తుంది. ఈ యాడ్‌లో అతను ఉత్పత్తుల ఆకర్షణ, శక్తితో జీవం పోస్తాడు. ఈ యాడ్ ఉల్లాసకరమైన, సాపేక్షమైన సెట్టింగ్‌ను చూపిస్తుంది. ఇక్కడ కోహ్లీ అందంగా డిజైన్ చేసిన ఇంటిని జ్యూస్, మిల్క్ షేక్స్ మరెన్నో పదార్థాలతో ఒక పిల్లవాడిలా పరీక్షిస్తాడు. ప్రతి పరీక్షలో ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ థీమ్స్‌ను సులభంగా నిర్వహిస్తుంది. ఆ పదార్థాల మరకలు స్థిరపడకముందే నిలుపుదల చేస్తుంది. ఈ లాంచ్‌తో ఏషియన్ పెయింట్స్ సూపర్ ప్రీమియం ఇంటీరియర్ పెయింట్ విభాగంలో మరోసారి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. పెయింట్స్, అలంకరణ విషయానికి వస్తే బ్రాండ్ పరిశ్రమలో పాల్గొనడమే కాకుండా దాని భవిష్యత్తును రూపొందిస్తోందని చూపిస్తుంది.

srushti test tube baby center case Namratha convention report9
సృష్టి కేసులో మరో ట్విస్ట్‌.. అసలు పేరు నీరజ.. 1988 బ్యాచ్‌తో కలిసి..

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. వందల మంది పిల్లలను సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు.సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ అని విచారణలో వెల్లడైంది. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్‌తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా బహిర్గమైంది. నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టు తెలిపారు.ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్‌మెంట్ ఇచ్చింది. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులను డబ్బు ఆశ చూపామని.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది. పిల్లల కొనుగోలులో సంజయ్‌తో పాటు.. సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లుగా తెలిపింది. తన రెండో కుమారుడు లీగల్‌గా సహకరించే వాడని నమ్రత వెల్లడించింది. విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుండి 20-30 లక్షలు వసూళ్లు చేసినట్లు అంగీకరించారు.అయితే, ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం విదితమే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Janmashtami 2025 celebrations  at Hare Krishna golden temple in Hyderabad 10
జన్మాష్టమి ఎలా ఆచరించాలి? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం

శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన దివ్య ధామం నుండి భూమిపై అవతరించిన పవిత్రమైన రోజు. ఈ పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు జరుపుకుంటారు. భగవంతుని అలౌకికమైన ఆవిర్భావం, దివ్య లీలలను అర్థం చేసుకోవడం ద్వారా జీవులు ముక్తిని పొంది, భగవద్దామాన్ని చేరగలరని భగవద్గీత బోధిస్తోంది. శ్రీ కృష్ణుడి జననం మానవ జీవిత సార్థకతకు అవసరమైన అనేక వరాలను లోకానికి అందించింది. మధురలోని కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు చతుర్భుజ విష్ణువుగా అవతరించటం, ఆపై సామాన్య బాలకుడిగా రూపాంతరం చెందటం, పసిపిల్లాడిగానే అనేక అసురులను మట్టుపెట్టడం, చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరిని ఎత్తి పట్టడం తదితర అసాధారణమైన లీలలన్నీ శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని చాటిచెబుతున్నవే.శ్రీకృష్ణుని అవతార లక్ష్యంశ్రీకృష్ణుని జననం సాధారణ శిశువుల వలె సంభవించినది కాదు. వాస్తవానికి ఆయన పుట్టుక లేనివాడైనప్పటికీ, తన అంతరంగిక శక్తిచేతనే ఈ లోకాన అవతరించి మన మధ్య జన్మించడం ఆయన దివ్య లీలల్లో ఒకటి. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని పునఃస్థాపించడం వారి అవతార ప్రయోజనాలలో మరొకటి. మనమంతా ఈ భౌతిక దేహాలు కాదని, శాశ్వత ఆత్మ స్వరూపులమని, నిరంతర ఆనందం మన సహజ స్థితి అని తెలుపుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం మన సనాతన సంస్కృతికి మూల స్థంభం. మానవ జన్మకు అంతిమ లక్ష్యం భగవంతునితో మన ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవాళికి అందించిన పరమ సందేశం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" (సమస్త ధర్మాలను త్యజించి నన్నే శరణు పొందుము). ఇది మోక్షాన్ని పొందే అత్యంత సరళమైన మార్గం.జన్మాష్టమిని ఎలా ఆచరించాలి?కృష్ణాష్టమి నాడు భక్తులు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం సహకరించనివారు పండ్లు, పాలు వంటి అనుకల్ప ప్రసాదం తీసుకోవచ్చు. మీకు సమీపంలోని శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుని సేవల్లో పాల్గొనండి. ముఖ్యంగా, ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం (కనీసం 108 సార్లు) చాలా శ్రేష్ఠం. పలు కారణాల రీత్యా దేవాలయానికి వెళ్లలేని భక్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుని కృపను పొందగలరు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తన నామ రూపంలో అవతరించి వున్నారు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి శ్రద్ధగా వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు తొలగి, భగవత్ప్రేమ పెంపొంది, ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలము. ఈ రోజు భగవద్గీత, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల నుండి శ్రీకృష్ణుని లీలలు, ఉపదేశాలను పఠించడం పుణ్యప్రదం.విశ్వవ్యాప్తమైన శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమిని విశ్వవ్యాప్త పండుగగా నిలపడంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల కృషి అపారం. 70 ఏళ్ల వయసులో తమ గురువు ఆదేశంతో పాశాత్య దేశాలకు వెళ్లి భగవద్గీత బోధనలను, పవిత్ర కృష్ణ నామాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలను స్థాపించి, జగన్నాథ రథయాత్రలను ప్రారంభించారు. 70కి పైగా గ్రంథాలను రచించి, వాటిని 25కు పైగా భాషల్లోకి అనువదించి పంపిణీ చేశారు. సామాన్య జీవన శైలితో అత్యున్నత తాత్త్విక చింతనను గలిగి జీవించే విధానాన్ని బోధించి ఎందరో శిష్యులకు మార్గనిర్దేశం చేశారు. యుగధర్మమైన హరినామ సంకీర్తనను ప్రపంచంలోని నగర గ్రామాలకూ వ్యాప్తి గావించి శ్రీచైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని సార్థకం చేసిన మహనీయులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేహరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి వేడుకలుహరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. భక్తులు రాధా గోవిందుల దర్శనం చేసుకోవచ్చు, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపవచ్చు (ఊంజల సేవ). భగవన్నామ జపం చేయటం, నామ సంకీర్తనల్లో పాల్గొనడం, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా దివ్య అనుభూతిని పొందవచ్చు. ఈ రోజు దేవాలయంలో వేలాది మందికి ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తారు. అంతేగాక ఈ ఏడాది నార్సింగిలో నిర్మితమవుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్, మరియు కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ వద్ద కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించబడతాయి.భక్తులందరూ కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయం ఆహ్వానిస్తోంది. పాఠకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! హరే కృష్ణ.-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ఎం.టెక్ (ఐఐటి మద్రాస్) అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement