
పండగలకు అధిక ప్రాధాన్యత
గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా పండగలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రతి గ్రామంలో గ్రామదేవతలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తొలకరి ప్రారంభంతో పంటలు బాగా పండాలని భూమిపండగ, బీరకాయ, ఆనపకాయ తినేందుకు పచ్చపండగ, వరివిత్తనాలు నాటే సమయంలో కొత్తల్ పండగ, చిక్కుడు కాయలు తినేందుకు చిక్కుడు పండగల ను వారు నిర్వహిస్తారు. దీంతో పాటు పెళ్లిళ్ల సమయంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రతి మూడేళ్లకు కొలుపులు నిర్వహిస్తారు. భూమిపండగ ఈ ప్రాంత గిరిజను లకు ఎంతో ప్రత్యేకమైనది. పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వెళ్లి సంప్రదాయ జంతువుల వేట కొనసాగిస్తుంటారు. మహిళలు తమ గ్రామాలకు సమీపంలోని ప్రధాన రహదారులపై సంప్రదాయ గిరిజన నృత్యాలు చేస్తూ వాహనదారుల నుంచి పండగ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు.ప్రస్తుతం పోలవరం ముంపులో భాగంగా తమను మైదాన ప్రాంతాలకు తరలిస్తుండడంతో భూమి పండగ నిర్వహించే అవకాశాలు ఉండవేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.