
కుమడ బస్సు బూసిపుట్టు వరకు పొడిగింపు
ముంచంగిపుట్టు: మండలంలోని అత్యంత మారుమూల పంచాయతీ కేంద్రమైన బూసిపుట్టు వరకు కుమడ బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులు పొడిగించారు. దీంతో నాలుగు పంచాయతీలకు చెందిన సుమారు 90 గ్రామాల గిరిజనులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో పాడేరు నుంచి ముంచంగిపుట్టు మీదుగా కుమడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సు వెళ్లేది. అక్కడి నుంచి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పరిసర ప్రాంతాల గిరిజనులు బస్సు సౌకర్యానికి దూరమయ్యారు. వీరి సమస్యను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్డును నిర్మించింది. దీంతో బస్సు సర్వీసు అందుబాటులోకి తేవాలని గిరిజనులు పలు సందర్భాల్లో జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ విధంగా ఎస్పీ అమిత్ బర్దర్‌ను వారు కోరారు. దీంతో ఆయన చొరవ మేరకు బూసిపుట్టు వరకు బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులు పొడిగించారు. దీనివల్ల ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని కుమడ, భూసిపుట్టు, జమిగూడ, గిన్నెలకోట పంచాయతీలకు చెందిన 90 గ్రామాల గిరిజనులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోడ్డు నిర్మించడం వల్లే బస్సు తమ గ్రామానికి వచ్చిందని బూసిపుట్టు వాసులు ఆనందం వ్యక్తం చేశారు.శనివారం వచ్చిన బస్సుకు గ్రామ మహిళలు, పెద్దలు హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజుక రెండు సార్లు బస్సు సర్వీసు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
90 గ్రామాల గిరిజనులకు
అందుబాటులోకి వచ్చిన సౌకర్యం
ఎస్పీ అమిత్ బర్దర్ చొరవతో సమస్య
పరిష్కారం
హర్షం వ్యక్తం చేసిన మారుమూల గ్రామాల గిరిజనులు

కుమడ బస్సు బూసిపుట్టు వరకు పొడిగింపు