పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు | - | Sakshi
Sakshi News home page

పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు

Aug 17 2025 6:45 AM | Updated on Aug 17 2025 6:46 AM

సీపీఎం ఆలిండియా సెక్రటరీ

ఎంఏ బేబీ ఆవేదన

ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

రంపచోడవరం: పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని సీఎం ఆలిండియా సెక్రటరీ ఎంఏ బేబీ హెచ్చరించారు. తాళ్లూరు, నాగులపల్లి పునరావాస కాలనీలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల్లో 85 శాతం మంది ఆదివాసీలు ఉన్నారని వివరించారు. పోలవరం నిర్వాసితులందరికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్టు పరిస్థితులను బట్టి స్పష్టమవుతుందని అన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపం కారణంగా వర్షాలకు శ్లాబ్‌లు కారిపోతున్నాయని, మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఉపాధి కోసం ప్రతి రోజు 30 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాస గృహాలకు అర్హులు సైతం దూరమయ్యారని వివరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఆందోళన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. ఇప్పటికై నా తక్షణమే బాధ్యతాయుతంగా స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయడంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55 వేల కోట్లు కాగా, ప్రజల పునరావాసానికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సింది ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో కూడిన పునరావాసం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తరువాత ఆ హామీని బుట్ట దాఖలు చేసిందన్నారు. ప్రజల సమస్యలు విన్నవించుకునేందుకు నోడల్‌ అధికారి సైతం అందుబాటులో లేరని వివరించారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారని అన్నారు. పాలక ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లాకార్యదర్శి బి కిరణ్‌, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్‌, సభ్యులు లోతా రామారావు, మట్ల వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు1
1/2

పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు

పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు2
2/2

పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement