చోడవరం : మండల పరిషత్ వైస్ ఎంపీపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ నుంచి శరగడం లక్ష్మిని ఆ పార్టీ ఎంపిక చేసింది. చోడవరం మండల పరిషత్ వైస్ ఎంపీపీ బుద్ద గంగరాజు ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. మండల పరిషత్‌లో 25 ఎంపీటీసీ స్థానాలకు గాను 20ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి ఉన్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు గంగరాజు రాజీనామా చేయడంతో ఆస్థానానికి జరుగుతున్న ఎన్నిక లాంఛనంగా వైఎస్సార్‌సీపీకే దక్కుతుంది. దీంతో పార్టీ ఎంపీటీసీలతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చోడవరంలో పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. గవర సామాజిక వర్గానికి చెందిన గంగరాజు రాజీనామాతోఅదే సామాజిక వర్గానికి చెందిన అంబేరుపురం ఎంపీటీసీ సభ్యురాలు శరగడం లక్ష్మికి ఆ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమన్వయకర్త అమర్‌నాధ్ ప్రకటించారు. ఈ సమావేశానికి 18మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. వీరంతా పార్టీ నిర్ణయానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమర్‌నాఽథ్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈనెల 27న ఎన్నిక జరుగుతుండడంతో పార్టీ ఎంపీటీసీలంతా ఒకే తాటిపై ఉండి ఏకగ్రీవంగా లక్ష్మిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ గాడి కాసు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ పాల్గొన్నారు.