కూలెప్పుడిస్తావు.. బాబూ? | - | Sakshi
Sakshi News home page

కూలెప్పుడిస్తావు.. బాబూ?

Apr 5 2025 1:36 AM | Updated on Apr 5 2025 1:36 AM

కూలెప

కూలెప్పుడిస్తావు.. బాబూ?

పనులకు హాజరయ్యే యాక్టివ్‌ జాబ్‌ కార్డులు
2,02,924

సాక్షి, అనకాపల్లి :

వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రజలంతా ఉపాధి పనుల బాట పట్టారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 5 నుంచి నేటి వరకు దాదాపు మూడు నెలల ఉపాధి కూలీల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.. ఏదో ఇంటి ఖర్చుల కోసం ఉపాధి పనులకు వెళ్లే కూలీలు మూడు నెలల వేతనాలు పడకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు ఎప్పుడు పడతాయా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో సుమారు రూ.52 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇంకా నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎస్‌.రాయవరం మండలంలో అత్యధికంగా రూ.3.95 కోట్ల బకాయిలున్నాయి.

ఒక్కో కూలీకి సగటున రూ.23 వేల బకాయి..

ఉపాధి పనులకు హాజరయ్యే కూలీకి రోజుకు రూ.250 నుంచి రూ.300 కూలీ డబ్బులు పడుతున్నాయి. మూడు నెలల బకాయి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకూ బకాయి చెల్లించాల్సి ఉంది.

2,81,075

జిల్లాలో మొత్తం జాబ్‌ కార్డులు

గడ్డి తిని బతకాలా?

ఉపాధి కూలీల వినూత్న నిరసన

చీడికాడ: పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ చీడిపల్లిలో ఉపాధి కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. కూలి డబ్బులు ఇవ్వకపోతే గడ్డి తిని బతకాలా.. అని ప్రశ్నిస్తూ నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు వేతనాల బకాయిలపై వెంకన్న వద్ద మొరపెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి జిల్లాలో 9 వారాలకు రూ.53 కోట్ల మేర వేతన బకాయిలున్నట్లు తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించని సంబంధిత శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం ఉపాధి చట్టంలో ఉందని గుర్తు చేశారు.

మూడు నెలలుగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కూలీలకు అందని వేతనాలు

జిల్లాలో సుమారు రూ.52 కోట్ల బకాయిలు

నిధులు విడుదల కాలేదంటున్న అధికారులు

వేతనాల కోసం వేచి చూస్తున్న 2.89 లక్షల మంది ఉపాధి కూలీలు

ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టకూడదు?

జిల్లాలో ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉంది. అ పరిస్థితి రాక ముందే తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఈ ఏడాది కొత్తగా మంజూరైన పనులకు రూ.7 పెంచామని ప్రభుత్వం చెబుతుంది. మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్‌ సౌకర్యం కూడా కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గతంలో తట్టా, గునపాం, పార, మంచినీళ్లు ఏర్పాటు చేసి, ట్రావెలింగ్‌, సమ్మర్‌ అలవెన్సులు ఇచ్చేవారు. అవి పూర్తిగా కట్‌ చేసి రూ.7 పెంచినట్లు ప్రకటించడం అన్యాయం. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ఉండి కూలీల కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఉపాధి హామీకి లక్ష కోట్లు ఉన్న బడ్జెట్‌ను పీఎం మోదీ ప్రభుత్వం దశలవారీగా రూ.62 వేల కోట్లకు తగ్గించింది. గట్టిగా ఉన్న నేలకు అదనంగా డబ్బులు ఇవ్వాలి.

– డి.వెంకన్న, ఏపీ వ్యవసాయి కార్మిక సంఘం కార్యదర్శి

కూలెప్పుడిస్తావు.. బాబూ? 1
1/1

కూలెప్పుడిస్తావు.. బాబూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement