
పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి
అనకాపల్లి: విద్యుత్ స్మార్ట్ మీటర్లు, సెకి ఒప్పందాలు రద్దు చేయాలని, ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై ఎనలేని భారాలు మోపిన విద్యుత్ సంస్కరణలపై ఏప్రిల్ మాసంలో ప్రజలను చైతన్యవంతం చేసి దశలవారీగా పోరాటాలకు సన్నద్ధం చేస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు చెప్పారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి, పోరాటాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి 10 నెలల పాలనలో ప్రజలపై విద్యుత్ చార్జీలు తగ్గించకపోగా రూ.15,485 కోట్లు అదనంగా సర్దుబాటు చార్జీల భారాన్ని మోపిందన్నారు. సెకీతో జరిగిన ఒప్పందాల వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాలపై ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, గంటా శ్రీరాములు, సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, బి.ఉమామహేశ్వరావు, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.