
అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ
● నిర్వాసితులకు త్వరలోనే పునరావాసం ● మూలపర గ్రామసభలో ఆర్‌డీవో రమణ
నక్కపల్లి: విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు త్వరలోనే పునరావాసం కల్పించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని నర్సీపట్నం ఆర్‌డీవో వి.వి.రమణ తెలిపారు. శుక్రవారం అమలాపురం శివారు మూలపర గ్రామంలో నిర్వాసితులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తోందని, ఇళ్లు కోల్పోయిన వారందరికీ పెద బోదిగల్లం వద్ద పునరావాసం కల్పిస్తామన్నారు. 2024 డిసెంబరు 31వ తేదీని కటాఫ్‌గా పరిగణనలోకి తీసుకుని నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి గుర్తించిన లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామసభలో విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేసుకోవాలని ఆయన కోరారు. ఉప సర్పంచ్ గంటా నర్సింగరావు, తదితరులు మాట్లాడుతూ అధికారులు విడుదల చేసిన జాబితాల్లో కొంతమంది అనర్హులు ఉన్నారన్నారు. స్థానికేతరులను ఈ గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని, వీటిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టి అనర్హులను జాబితా నుంచి తొలగించాలని కోరారు. వచ్చిన ఆభ్యంతరాలపై సమగ్ర విచారణ చేస్తామని ఆర్డీవో తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు సూరాకాసుల గోవిందు, సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ నిర్వాసితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం, రూ.8.30 లక్షలు ప్యాకేజీ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మూలపర గ్రామంలో 198 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిర్మాణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీ పెంచాలని కోరారు. 18 ఏళ్లు నిండి వివాహమైన మహిళలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ నర్సింహమూర్తి, సర్పంచ్ శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ