
రేపు అప్పన్న వార్షిక కల్యాణోత్సవం
● 3 గంటల నుంచి కొట్నాల ఉత్సవం ● సాయంత్రం 6.30 నుంచి ఎదురు సన్నాహోత్సవం ● రాత్రి 8.15 గంటల నుంచి రథోత్సవం ● రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం ● నేడు 7 గంటల వరకే స్వామి దర్శనం
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి జరగనుంది. సింహగిరిపై ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సింహాచల దేవస్థానం వైదిక, అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులు, ముత్తైదువులు పసుపు కొమ్ములను దంచి కొట్నాలు ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానం పలుకుతూ ఆలయ ధ్వజస్తంభం వద్ద గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి ఎదురుసన్నాహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామి ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని బంగారుచాయ పల్లకీలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో ఉంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. జోడుభద్రాల ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేస్తారు. అక్కడ ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామిని, అమ్మవార్లను రథంపై అధిష్టింపజేసి రాత్రి 8.15 గంటల నుంచి మాడ వీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10.30 గంటల నుంచి ఉత్తర రాజగోపురం ఎదురుగా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న భారీ వేదికపై వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి సోమవారం రాత్రి అంకురార్పణ చేస్తారు. ఈ కారణంగా సోమవారం రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు లభిస్తాయి.
విశేషంగా ఏర్పాట్లు : రథోత్సవం, కల్యాణోత్సవం కోసం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవస్థానం ప్రాంగణంలో భారీ కల్యాణ వేదికను తీర్చిదిద్దుతున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 164 సీసీ కెమెరాలకు అదనంగా కల్యాణోత్సవ ప్రాంగణంలో మరో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఆరు వేల చిన్న లడ్డూ ప్రసాదంతో పాటు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం అన్నదాన భవనంలో 5 వేల మందికి, రాత్రి 6 వేల మందికి అన్నప్రసాద వితరణ ఉంటుంది. మంగళవారం సా యంత్రం 5 గంటల నుంచి రాత్రి కల్యాణం ముగిసే వరకు కొండపైకి 10 షటిల్ బస్సులు నడుస్తాయని సింహాచలం డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. కల్యాణం పూర్తయిన తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 120 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ గొలగాని అప్పారావు పేర్కొన్నారు.

రేపు అప్పన్న వార్షిక కల్యాణోత్సవం