
మా ఆకలి కేకలు వినిపించవా..!
● పంచాయతీ కార్మికుల నిరసన
● బుచ్చెయ్యపేటలో ఖాళీ ప్లేట్లతో ఆందోళన
బుచ్చెయ్యపేట : ఆకలితో అలమటిస్తున్నాం జీతాలు అందించి ఆదుకోవాలంటూ మండల స్వీపర్లు(పంచాయతీ కార్మికులు) ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు దిగారు. సోమవారం మండల కేంద్రం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట 35 పంచాయితీ గ్రామాలకు చెందిన స్వీపర్లు ఖాళీ ప్లేట్లు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జీతాలు అందించి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. గ్రామాల్లో ఉన్న కాలువల్లో మురుగు పూడిక పోయి కంపుకొడుతున్న చెత్తను నెత్తిన పెట్టుకుని రోజూ తీవ్ర దుర్గంధం నడుమ పారిశుధ్య పనులు చేస్తున్నాం.. తెల్లవారుజాము నుంచి విధులు నిర్వహిస్తూ గ్రామాల్లో ఉన్న చెత్తాచెదారంతో పాటు తుప్పలు,డొంకలు తొలగించి సంపూర్ణ పారశుధ్యానికి కృషి చేస్తున్నాం... ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా ట్యాంకులు కడిగి తాగునీరు అందిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పారిశుధ్య కార్మికులు ఆవేదన చెందారు. మండలంలో సుమారు 300 మంది వరకు పని చేస్తున్నామని ఒక్కొక్కరికీ ఐదు నుండి 13 నెలలు జీతాలు అందాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంతో అర్ధాకలితో అలమటిస్తున్నామని అన్నారు. వారి ఆందోళనకు సీఐటీయూ మండల నాయకులు పినపాత్రుని సాంబశివరావు, ఎస్.వి.నాయుడు, జిల్లా కోశాధికారి వి.శ్రీనివాసరావు మద్దతుగా నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికల ముందు ప్రజల కోసం పలు ప్రగల్భాలు పలికేవారని తన సొంత శాఖలో పని చేస్తున్న పంచాయతీ కార్మికుల ఆకలి కేకలు ఆయనకు తెలియదా..? అంటూ సీఐటీయు నాయకులు ప్రశ్నించారు. వెంటనే పంచాయతీల్లో టెండర్ విధానం రద్దు చేసి ప్రతి పారిశుధ్య కార్మికుడికి నెలకు రూ.10 వేలు జీతం అందించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు అందించాలని, ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని, యూనిఫాం, గ్లౌజులు అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో విజయలక్ష్మికి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. కార్మిక సంఘ నాయకులు ఏసు, నూకరాజు, అమ్మాజీ, శ్రీను,మరియమ్మ, కొండబాబు, ప్రసాద్,రాజు తదితరులు పాల్గొన్నారు.