
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
● స్నేహితులే హంతకులని పోలీసుల నిర్ధారణ ● ఇద్దరు యువకులు, మైనర్ బాలుడిపై కేసు నమోదు
రావికమతం : మేడివాడ యువకుడు కొలిపాక పవన్ కుమార్(22) హత్య కేసును రావికమతం పోలీసులు ఛేదించారు. గర్నికం తిరుమల ఫంక్షన్ హాలు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి పవన్ కుమార్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పవన్‌కుమార్ తండ్రి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మూడు బృందాలతో దర్యాప్తు చేపట్టారు. రావికమతానికి చెందిన అతడి స్నేహితుల ప్రమేయం ఉందని భావించిన పోలీసులు అనుమానితుల కోసం గాలించి మంగళవారం ఇద్దరు యువకులు, మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మంగళవారం రావికమతం పోలీసుస్టేషన్ వద్ద పవన్ కుమార్ హత్యకు సంబంధించిన వివరాలను విలేకరులకు తెలిపారు. అనుమానితులైన వేపాడ నరేంద్ర కుమార్, కేతి దుర్గా ప్రసాద్, మైనర్ బాలుడినిసి అదుపులోని తీసుకుని విచారించినట్టు చెప్పారు. మృతి చెందిన పవన్‌కుమార్, వేపాడ నరేంద్ర కుమార్, కేతి దుర్గాప్రసాదుల మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయని, వారు ఎప్పడూ మద్యం తాగి ఘర్షణ పడుతుండేవారని చెప్పారు. నలుగురూ ఆదివారం మధ్యాహ్నం నుంచి మద్యం సేవిస్తున్నారు. వేపాడ నరేంద్రకుమార్ మద్యం మత్తులో ఉన్నప్పడు పవన్‌కుమార్ డబ్బులు దొంగిలించాడని ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో నరేంద్రకుమార్ మద్యం సీసాను పగలగొట్టి పవన్‌కుమార్‌పై దాడి చేశాడు. మిగిలిన ఇద్దరూ సహకరించారని డీఎస్పీ శ్రావణి తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితులు వేపాడ నరేంద్రకుమార్, దుర్గాప్రసాద్ చైన్నె రైల్వేస్టేషన్‌కు సమీపంలో తాళాలు వేసి వున్న ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారని, నరేంద్రకుమార్ నుంచి ఒకటిన్నర తులాల బంగారం గొలుసు, రూ.35 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
అనకాపల్లి జిల్లా, విశాఖ నగర పరిదిలో వివిధ పోలీసు స్టేషన్లలో మోటర్ సైకిళ్లు, ఇళ్లలో దొంగతనాలకు సంబంధించి గతంలో 10 కేసులు ఉన్నాయని, పలుమార్లు అరెస్టు అయ్యారని చెప్పారు. నిందితులను అరెస్టు చేశామని బుధవారం కోర్టులో పర్చుతామని, మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. ఒక్క రోజులో కేసును ఛేదించిన కొత్తకోట సీఐ కోటేశ్వరరావును, రావికమతం ఎస్‌ఐ రఘువర్మ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.