
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలి
అనకాపల్లి : పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతిని సి.సి.టి.ఎన్.ఎస్. (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కు సిస్టమ్)లో సమయానికి నమోదు చేయాలని రాష్ట్ర ఐజీ ఎఫ్.ఎస్.ఎల్. డైరెక్టర్ జి.పాలరాజు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంత నేర సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని రివ్యూ మీటింగులు సి.సి.టి.ఎన్.ఎస్. ఆధారంగా నిర్వహించనున్నందున, ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలు దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తులో నిందితుల ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా త్వరితగతిన లోకేషన్ గుర్తించి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పోలీస్ స్టేషన్‌లో ఎక్కువగా ఏ రకమైన కేసులు నమోదు అవుతున్నాయో గుర్తించి, సమీక్షించి తగ్గించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టీ కేసుల నమోదు, కోర్టులలో జరిమానా విధింపు తదితర అంశాలపై కోర్టు కానిస్టేబుళ్లను అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ డ్రోన్‌న్‌ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, పండగలు, జాతర్ల వద్ద నిఘా పెంపు చేయాలని, పేకాట, ఓపెన్ డ్రింకింగ్, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాలు, ప్రార్థనా స్థలాలు, లేడీస్ హాస్టళ్ల భద్రత కోసం సీసీ కెమెరాలు, వాచ్‌మెన్ ఏర్పాటు చేయించాలన్నారు. హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచి, కౌన్సెలింగ్ ఇవ్వాలని, హత్య, అత్యాచారం, గంజాయి, రోబరీ, దొంగతనాలు, పోక్సో కేసుల్లో నిందితులపై ప్రత్యేక దృష్టి సాధించి, అవసరమైతే రౌడీ/హిస్టరీ షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కృష్ణ చైతన్య, సీఐలు లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, రమేష్, గఫూర్, ఎస్‌ఐలు ప్రసాద్, సురేష్, వెంకన్న, రమణయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ఐజీ ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ పాలరాజు
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించిన ఎస్పీ సిన్హా