
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
పద్మనాభం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన పద్మనాభం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వానపల్లి వెంకటరమణ(60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈయన ఎస్.రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విశాఖపట్నంలో పదో తరగతి మూల్యాంకనానికి వెళ్లి సాయంత్రం పద్మనాభంలోని తన ఇంటికి వచ్చాడు. అనంతరం సొంత పని మీద ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో రామనారాయణపురం సమీపంలో వెనుక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణకు తీవ్ర గాయాలు కాగా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎంబీఏ, కుమార్తె పీజీ పూర్తి చేశారు. వెంకటరమణ మృతిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.