
రుషిల్ డెకార్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
అచ్యుతాపురం రూరల్: రుషిల్ డెకార్ పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత బాయిలర్ ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. 10 రోజులుగా షట్ డౌన్ పనులు చేసి ట్రయల్ చేస్తున్న సమయంలో ఇన్సులేషన్ మీద ఫెర్మిక్ ఫ్యూయల్ పడి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు చెబుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. అయితే పరిశ్రమ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. షట్ డౌన్ అనంతరం ట్రయల్ చేసే సమయంలో చుట్టుపక్కల కెమికల్ అవశేషాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు వహించకపోవడం వలనే అగ్ని ప్రమాదం జరిగిందని సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్లైవుడ్ తయారు చేసే ఈ పరిశ్రమ ప్రాంగణంలో వేల టన్నుల కలప ఉన్నందున అగ్ని ప్రమాదం భారీ స్థాయిలో జరిగి ఉంటే కోట్ల విలువైన రుషిల్ పరిశ్రమతోపాటు చుట్టుపక్కల చాలా కంపెనీలు, గ్రామాలు అగ్నికి ఆహుతై ఉండేవని కార్మికులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ నిండా పెద్ద ఎత్తున ఎండిన వేల టన్నుల కలపతోపాటు ప్లైవుడ్ తయారీకి ఉపయోగించే కెమికల్స్‌ను కూడా నిల్వ చేశారు.
ఒక్క అగ్గి రవ్వ పడినా..
మార్టూరు గ్రామానికి సమీపంలో రుషిల్ డెకార్ పరిశ్రమ ప్రాంగణంలో వేల టన్నుల కర్రల మేట అనధికారికంగా నిల్వ చేసి ఉన్నారు. ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేకుండా గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన కర్రల నిల్వ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఏ ఒక్క చిన్న అగ్గి రవ్వ ఆ ఎండిన కర్రలపై పడినా మార్టూరు గ్రామంతో పాటు సెజ్ పునరావాస దిబ్బపాలెం పంచాయతీ అంతా అగ్ని ప్రమాదానికి గురవుతుందని భయాందోళన చెందుతున్నారు.
ప్రమాదంపై పూర్తి విచారణ చేపట్టాలి
ఈ సంఘటనపై సీఐటీయూ నాయకులు ఉదయం గేటు లోపల ఉన్న పరిశ్రమ సిబ్బందిని ప్రశ్నించగా వారు అసలు ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని తొలుత బుకాయించారు. అయితే తమ దగ్గర ఉన్న వీడియోలను వారికి చూపించడంతో రాత్రి అగ్నిప్రమాదం జరిగిందని అంగీకరించారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బయట ప్రపంచానికి తెలియనీయకుండా పరిశ్రమల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయే తప్ప ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా ఇదే పరిశ్రమలో ప్రమాదాలు జరిగి కార్మికులు అంగవైకల్యం పాలైనట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆరోపించారు. అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారు లు సమగ్ర విచారణ జరిపి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావుతో కలిసి ఆయన డిమాండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, లేబర్ అధికారులు నిరంతరం పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు.
గోప్యంగా ఉంచిన యాజమాన్యం
ప్రమాదంపై విచారణ చేపట్టాలని సిటు డిమాండ్
ఫైర్ సేఫ్టీ లేకుండా అనధికారికంగా వేల టన్నుల కలప నిల్వలు

రుషిల్ డెకార్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

రుషిల్ డెకార్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం