
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్ట్
● ఒకరు పరారీ ● లిక్విడ్ గంజాయి స్వాధీనం
నర్సీపట్నం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో కె.డి.పేట, గొలుగొండ ఎస్‌ఐలు తారకేశ్వరరావు, రామారావు, ఏఆర్ ఎస్‌ఐ వెంకటరావు, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కేడీ పేట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారులో లిక్విడ్ గంజాయి తీసుకువెళ్తుండగా గుర్తించి పట్టుకున్నారు. కడప జిల్లా కోరుమిల్లి మండలం, గిరినగర్ గ్రామానికి చెందిన చాటకుండు గురయ్యను అరెస్ట్ చేశారు. ఇతను పలు కేసుల్లో నిందితుడు. ఈయనపై బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉందని డీఎస్పీ తెలిపారు. అదే జిల్లాకు చెందిన నాగడసారి కేశవ గంజాయి రవాణాకు సహకరించాడు. అక్కి దాసరి శ్రీహరి టూరిజం ట్రిప్ పేరుతో అద్దెకు కారు తీసుకున్నాడు. జీకే వీధి మండలం జెర్రిల పంచాయతీ వంతడపల్లికి చెందిన ముర్ల చంటిబాబును అరెస్ట్ చేశారు. ఈయన కూడా పాత కేసుల్లో నిందితుడు. గంజాయి రవాణాకు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పరారులో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాటగుంట యరయ్య, చంటిబాబు కడప జిల్లా బద్వేల్ జైల్‌లో గంజాయి కేసులో ముద్దాయిలుగా ఉన్నప్పడు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఇటీవల జైల్ నుంచి విడుదలయ్యారు. చంటిబాబుకు స్నేహితులైన కేశవ, అక్కిదాసరి శ్రీహరి లిక్విడ్ గంజాయి వ్యాపారం చేసేందుకు మాట్లాడుకున్నారు.
ఒడిశా సరిహద్దులో లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేశారు. నలుగురూ లిక్విడ్ గంజాయిని కారు డోర్‌లో పెట్టి రవాణా చేస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో గంజాయి దొరికిందని డీఎస్పీ తెలిపారు. కిలో లిక్విడ్ గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందన్నారు. రవాణాకు ఉపయోగించిన టయోటా కారును పోలీసులు సీజ్ చేశారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.