
వడగళ్ల వానతో అతలాకుతలం
అనకాపల్లి టౌన్/బుచ్చెయ్యపేట: జిల్లాలో పలుచోట్ల శనివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 35.6 డిగ్రీల సెల్సియస్‌తో ఎండ మండిపోగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో వాతావరణం అంతా చల్లబడిపోయింది. అనకాపల్లిలో సుమారు గంటసేపు కురిసిన వర్షం 25.8 మి.మీ గా నమోదైంది. ప్రారంభంలో కొద్ది సేపు వడగళ్లు పడ్డాయి. ఈ వర్షం వలన లక్ష్మీదేవిపేట పాత్రుడు కాలనీలో భారీ వృక్షంతో పాటు రెండు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఈ గాలికి విద్యుత్ వైర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టమే తప్పింది. గవరపాలెం నూకాంబిక ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ అమ్మవారి విద్యుత్ అలంకరణ సెట్ నేలకొరిగింది. ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. గవరపాలెం పూర్తిగా మునిగిపోయింది. విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జిలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది, బంగారుమెట్ట, ఎల్‌బీ పురం, విజయరామరాజుపేట తదితర గ్రామాల్లో వడగళ్లతో వర్షం కురిసింది. దీంతో జీడిమామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వడగళ్లు మామిడి కాయలపై పడితే మచ్చలు వచ్చి కాయలు దెబ్బతిని కుళ్లిపోతాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి, బుచ్చెయ్యపేటలో భారీ వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం
తెగిన కరెంటు తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

వడగళ్ల వానతో అతలాకుతలం