
పగిలిన గుండెలు...
ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12:30 గంటల సమయం..ఒకవైపు మండుతున్న సూర్యుడి భగభగలు..మరోవైపు సెగలు కక్కుతున్న వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులు...ఊపిరి సలపని పని...కడుపు ఆకలితో నకనకలాడుతోంది... కాసేపట్లో పని చాలించి ఓ ముద్ద తిని వద్దాం..అనుకుంటుండగా..ఒక్కసారిగా భూమి దద్దరిల్లిన శబ్దం. దిక్కులు పిక్కటిల్లేలా కార్మికుల హాహాకారాలు... క్షణకాలంలో తునాతునకలైన దేహాలు...పూర్తిగా కాలిపోయిన శరీరాలు... కాలిన గాయాలతో బాధితుల పెడబొబ్బలు... ఒక్కసారిగా భీతిగొలిపే దృశ్యాలతో ఆ ప్రాంతం రక్తకాసారంగా మారిపోయింది. ఏం జరిగిందో తెలిసేలోగానే ఎనిమిది మంది అక్కడికక్కడే బుగ్గయిపోయారు... మరో ఎనిమిది మంది క్షతగాత్రులుగా మారిపోయారు...కోటవురట్ల మండలం కై లాసపట్నం సమీపంలోని విజయలక్ష్మి ఫైర్ వర్క్స్‌లో సంభవించిన ఘోరప్రమాదం దృశ్యమిది...
● మధ్యాహ్నం 12.30 గంటలకు భారీగా పేలుడు ● ఎనిమిది మంది దుర్మరణం, మరో ఎనిమిది మందికి గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం ● ప్రమాద సమయంలో కేంద్రంలో 16 మంది కార్మికులు ● విశాఖపట్నం, నర్సీపట్నం ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు ● పదేళ్ల క్రితం గోకులపాడులో ఇదే పరిశ్రమలో ప్రమాదం ● ఆ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం ● మళ్లీ దశాబ్దం తరువాత అదే ఘోర కలి ● భద్రతా తనిఖీల్లో లోపం...కార్మికులకు శాపం
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
ప్రమాదంలో మృతులు
1. దాడి రామలక్ష్మి (35), రాజుపేట
2. పురం పాప (40), కై లాసపట్నం
3. గుప్పిన వేణుబాబు (34), కై లాసపట్నం
4. సంగరాతి గోవిందు (40), కై లాసపట్నం
5. సేనాపతి పైడితల్లినాయుడు అలియాస్ బాబూరావు (60), చౌడువాడ
6. అప్పికొండ తాతబాబు అలియాస్ పల్లయ్య (50), కై లాసపట్నం
7. దేవర నిర్మల (38), వేట్లపాలెం
8. హేమంత్ మనోహర్ (20), భీమిలి
కొంపముంచిన పండగ ఆర్డర్
గ్రామాల్లో వివిధ పండుగలు ఉన్నాయి. బాణసంచా సామగ్రి కావాలి అని ఆర్డర్ వచ్చింది. దీంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. సెలవయినా ఆదివారం కూడా పనిచేశారు. పని ఒత్తిడిలో నిప్పు రవ్వలు వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ రవ్వల వల్ల పేలుడు జరిగి ఉండవచ్చు. ఈ సంఘటనలో బాణసంచా కంపెనీ యాజమాని కూడా గాయపడ్డారు.
–అప్పారావు, నాగరాజు మేనల్లుడు, కై లాసపట్నం
ఆదివారం సెలవయినా డ్యూటీకి వెళ్లి...
ఆదివారం డ్యూటీకి సెలవు. అయినా పనులు ఉన్నాయని చెప్పడంతో నా భర్త డ్యూటీకి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసినా తిరిగి వెంటనే డ్యూటీకి వెళ్లారు. అక్కడ ఏమయ్యిందో తెలియదు కానీ పెద్ద శబ్దం రావడంతో భయపడ్డాము. ఆ తర్వాత కొద్ది సేపటికి ఫోన్ వచ్చింది. ఈ ప్రమాదంలో నా భర్త గోవిందు గాయపడ్డారని ఫోన్‌లో చెప్పారు. పరుగెత్తి కంపెనీ వద్దకు చేరుకున్నాము. అక్కడ పరిస్థితి చూస్తే చాలా భయం వేసింది. కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. నా భర్త ఎక్కడ ఉన్నాడా అని వెతికాను. చివరకు కనిపించారు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొని వెళ్లాము. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు పంపారు. –సియ్యాద్రి వరలక్ష్మి, గోవిందు భార్య, కై లాసపట్నం
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
1. జల్లూరు నాగరాజు(50), రాట్నాలపాలెం
2. సియాద్రి గోవింద్(38), కై లాసపట్నం
3. వేలంగి సంతోషి (44), సామర్లకోట
4. వేలంగి సారోని(19), సామర్లకోట
5. మడగల జానకిరామ్(55), కై లాసపట్నం
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు...
1. గంపెన సూరిబాబు(40), కై లాసపట్నం
2. సంగరాతి శ్రీను(35), కై లాసపట్నం
3. వేలంగి రాజు (19), సామర్ల కోట)
ప్రమాద స్థలంలో భీతావహ దృశ్యాలు...
ఘటన సమయంలో మందుగుండు సామగ్రి దంచుతున్న హేమంత్ మనోహర్ అనే వ్యక్తి తునాతునకలయ్యాడు. భారీ పేలుడుకు తల, కుడి చేయి ఎగిరిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురు శరీరాలు పూర్తిగా కాలిపోయి విగతజీవులుగా కనిపించారు. ఇక గాయపడిన 8 మందిలో నాగరాజు (52)కు 90 శాతం కాలిన గాయాలతో, జానకీరాంకు 60 శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కూలి డబ్బుల కోసం వెళ్లి..
పనికెళ్లిన నాలుగు రోజులకే..
ప్రతిరోజూ అక్కడ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తారు. బాణసంచా కేంద్రంలో ప్రమాద ఘటన జరిగే సమయానికి 16 మంది మాత్రం ఉన్నారు. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం కోటవురట్ల మండలంలో అన్నవరం, చౌడువాడ, పందూరు గ్రామాల్లో గ్రామ జాతర ఉత్సవాలు ఉండడంతో బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో గత వారం రోజులుగా పని ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో అక్కడ పనిచేసే సామర్లకోటకు చెందిన ఒక కుటుంబం సంతకు వెళ్లేందుకు ఓనర్ నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. దీంతో అక్కడ పనిచేసే 11 మందితో పాటు ఈ అయిదుగురూ ప్రమాదంలో గాయపడ్డారు.
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని రేఖవానిపాలెం పంచాయతీ మహాలక్ష్మీపురానికి చెందిన మెడిసి హేమంత్(24) ఇటీవల బాణసంచా తయారీ నేర్చుకున్నాడు. తెలిసిన వారి ద్వారా నాలుగు క్రితం కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో పనికి వెళ్లాడు. బాణసంచా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అశువులుబాశాడు. అతని తండ్రి మెడిసి సత్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి లేరు. అక్క స్వర్ణకల ఉన్నారు. తన కొడుకు ఇంటికి ఆధారంగా ఉంటాడని భావించామని.. త్వరలో వివాహం కూడా చేయాలని అనుకున్నామని.. ఇంతలో ఘోరం జరిగిపోయిందని తండ్రి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. అందరితో సరదాగా ఉండే హేమంత్ ఇకలేడన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు విషాదం మునిగిపోయారు.
సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల :
పొట్టకూటి కోసం మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు వెళ్లిన పలువురు కార్మికులు ఆ మందుగుండుకే ఆహుతయ్యారు. బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పేద కార్మిక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన విస్ఫోటనం ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను మింగేసింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రామస్తులంతా ఇళ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించి అగ్ని ప్రకంపనలు సృష్టించినట్టుగా చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో గల బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు ధాటికి గ్రామస్తులు భీతావహులయ్యారు. మంటలు ఎగిసిపడుతుంటే ఆవైపు వెళ్లాలంటే భయం..మరో వైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైర్ ఇంజన్, 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదం జరిగిందిలా...
కై లాసపట్నం గ్రామానికి చెందిన మడగల జానకీరాం తన తోడల్లుడు అప్పికొండ తాతబ్బాయి పేరున ‘విజయలక్ష్మి ఫైర్‌వర్క్స్’ మందుగుండు తయారీకి లైసెన్సు తీసుకుని 20 ఏళ్లుగా మందుగుండు తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్‌కు వచ్చే ఏడాది 2026 వరకూ గడువు ఉంది. దీపావళి పండగతో పాటు సమీప మండలాల్లో పల్లెల్లో జరిగే గ్రామ పండుగలకు వచ్చే ఆర్డర్లపై మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. కొత్త అమావాస్య నుంచి వరుసగా పల్లెల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వర్క్‌లోడ్ ఎక్కువగా ఉండడంతో కార్మికులు ఒత్తిడితో పనిచేస్తున్నారు. సరిగ్గా 12.30 గంటల సమయంలో ఓ కార్మికుడు మందును దంచుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. వారం రోజులుగా తయారు చేసిన మందుగుండు సామగ్రి మొత్తం అక్కడే ఉండడంతో ఒక్కొక్కటిగా క్షణాల్లో అంటుకుపోయాయి. పక్కనే ఉన్న పౌడర్‌పై అగ్గి రేణువులు తూలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పనిచేస్తున్న కార్మికులు తేరుకుని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్రంగా కాలిపోయి 8 మంది కార్మికులు అక్కడికక్కడే మాడి మసైపోయారు. విస్ఫోటనం ధాటికి అక్కడ ఉన్న రేకుల షెడ్లు, రెండు చిన్న స్లాబ్ గదులు చెల్లా చెదురయ్యాయి. భూమి కంపించినట్టయి..పెద్దగా మంట రావడంతో గ్రామస్థులంతా అదిరిపడి ఒక్కసారిగా పరుగున వచ్చారు. వరహాలు అనే గ్రామస్తుడు ఫైర్ ఇంజిన్, 108కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం, నక్కపల్లి, కోటవురట్ల, ప్రభుత్వ ఆస్పత్రి 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.సమీప నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నుంచి మూడు ఫైర్ ఇంజిన్‌లు వచ్చాయి. మంటలు అదుపు చేయడానికి సుమారు 4 గంటల పాటు సమయం పట్టింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని విశాఖ కేజిహెచ్‌కు తరలించారు. మైనర్ గాయాలతో ఉన్న వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఘటనా స్థలానికి కలెక్టర్..
ప్రమాదం జరిగిన గంటన్నర వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక కోటవురట్ల సీహెచ్‌సీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కోటవురట్ల ప్రభుత్వ ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎంవీపీకాలనీ (విశాఖ)/కోటవురట్ల: కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం రాత్రి ఆమె ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనలో మృతి చెందిన వారంతా ఐదేళ్లుగా ఆ బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నారన్నారు. 2026 వరకు ఆ కేంద్రానికి లైసెన్స్ ఉందన్నారు. పేలుడు పదార్థం చేజారడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే విషయం ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న 16 మందిలో 8 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి కేజీహెచ్‌లోను, ముగ్గురికి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోను మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన 8 మందికి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్టు తెలిపారు. మరో రూ.2 లక్షలు కేంద్రం నుంచి కూడా మంజూరవుతుందన్నారు. క్షతగాత్రులకు రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఆమె వెంట కలెక్టర్ హరింద్రప్రసాద్, కేజీహెచ్ ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఉన్నారు.
కోటవురట్ల: ప్రమాద ఘటనలో మృతులంతా రెక్కాడితే కాని డొక్కాడని వారే కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కై లాసపట్నానికి చెందిన సంగరాతి గోవిందుకు ఇద్దరు పిల్లలు కాగా పాప ఇంటర్, బాబు 9వ తరగతి చదువుతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలని ఆలోచనతో గోవిందు స్థానికంగా ఉన్న మందుగుండు తయారీ కేంద్రానికి నాలుగేళ్లుగా పనికెళుతున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతురాలు పురం పాప మూడేళ్లుగా ఇందులో పనిచేస్తోంది. ప్రమాదమని తెలిసినా కుటుంబానికి వేరే ఆధారం లేక పని కెళ్లి అనంతలోకాలకు పోయింది. మరో మృతుడు గుంపిన వేణుబాబు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోతే ఆ రోజు పస్తులే. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతుడు అప్పికొండ తాతబ్బాయి కాగా ఇతని పేరునే విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ లైసెన్సు ఉంది. ఇతని తోడల్లుడు మడగల జానకీరాం ఈ ఫైర్ వర్క్స్‌ను నడుపుతుండగా తోడల్లుడికి సాయంగా ఇందులో పనిచేస్తున్నాడు. చౌడువాడకు చెందిన శానాపతి బాబూరావు ఫైర్ వర్క్స్ యజమాని మడగల జానకీరాంకు మావ అవుతారు. అల్లుడికి సాయంగా ఉండడం కోసం ప్రతి రోజు ఉదయాన్నే చౌడువాడ నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రమాదంలో ఇతనితో పాటు ఇతని పెద్దల్లుడు, స్వయాన బావమరిది అయిన అప్పికొండ తాతబ్బాయి కూడా మృతి చెందడంతో ఈ కుటుంబంలో పెద్ద విషాదాన్ని నింపింది. మామా అల్లుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరో అల్లుడు ఫైర్ వర్క్స్ యజమాని అయిన మడగల జానికీరాం కూడా దాదాపు 40 శాతం కాలిపోవడంతో ప్రమాదస్థితిలో విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
బాణసంచా కేంద్రంలో బతుకులు బుగ్గి కై లాసపట్నంలో ఘోర విషాదం
పొట్టకూటికి ప్రమాదకర పనిలో...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...

పగిలిన గుండెలు...