
పనులు సరే...పైసలేవి!
● నిలిచిన చెల్లింపులు ● అధికారుల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు
నర్సీపట్నం : గోతులు పూడ్చారు..కానీ ఫైసల కోసం కాంట్రాక్టర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పు, చొప్పు చేసి పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్లు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్రాంతి నాటికల్లా ఎక్కడా చిన్న గొయ్యి కూడా ఉండడానికి వీలు లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నిధులు మంజూరు చేయడంతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలో రోడ్లు భవనాలశాఖ అధికారులు 14 సెక్షన్‌ల్లో గుంతలు పూడిచే పనులు చేపట్టారు. సంక్రాంతి నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షా ్యన్ని నిర్దేశించింది. అధికారులు వెంటపడి సంబంధిత పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లచే నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయించారు. పనులు పూర్తయి సుమారు మూడు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అర్‌అండ్‌బీ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పనులు జరిగినంత తొందరగా..బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
సకాలంలో పనులు పూర్తి చేసినా...
జిల్లాలో నర్సీపట్నం, పాయకరావుపేట, కె.కోటపాడు, కె.డి.పేట, సబ్బవరం, పెదబొడ్డేపల్లి, పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లి, వి.మాడుగుల, దార్లపూడి, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి సెక్షన్‌ల్లో రూ.8.80 కోట్లతో 119 వర్కులకు గాను 521.32 కిలో మీటర్ల పొడవున రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. కేవలం రూ.70 లక్షలు మాత్రమే కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రూ.8.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేసిన ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో బిల్లులు చెల్లింపు నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వంలో నిధులు పుష్కలంగా వస్తాయనే ఆశతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు అప్పులు చేసి మరి పనులు చేపట్టారు. ప్రభుత్వ సంకల్పం నెరవేరింది కానీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగలేదు. కాంట్రాక్టర్లను వెంటపడి పనులు చేయించిన అధికారులు సైతం బిల్లుల విషయంలో సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు అందకపోవడంతో చేసిన అప్పులకు కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా ఇన్‌ఛార్జీ ఈఈ విద్యాసాగర్‌ను సంప్రదించగా రూ.70 లక్షల వరకు బిల్లులు చేశాం.. నిధులు విడుదలైన వెంటనే మిగిలిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.

పనులు సరే...పైసలేవి!