జేసీ కేతన్‌గార్గ్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

జేసీ కేతన్‌గార్గ్‌ బదిలీ

Published Sun, Jul 21 2024 4:54 PM | Last Updated on Mon, Jul 22 2024 1:13 PM

జేసీ కేతన్‌గార్గ్‌ బదిలీ

జేసీ కేతన్‌గార్గ్‌ బదిలీ

రాజమహేంద్రవరం మునిసిపల్‌

కమిషనర్‌గా నియామకం

అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జెడ్పీ సీఈఓ నిదియాదేవి కూడా బదిలీ

అనంతపురం అర్బన్‌: జేసీ కేతన్‌గార్గ్‌ బదిలీ అయ్యారు. రాజమహేంద్రవరం మునిసిపల్‌ కమిషనర్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేసీతో పాటు అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, జెడ్పీ సీఈఓ వైఖోమ్‌ నిదియాదేవిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. మేఘస్వ రూప్‌ను మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా, నిదియాదేవిని రాజంపేట సబ్‌కలెక్టర్‌గా నియమించింది.

జేసీగా రెండేళ్లు పూర్తి

జాయింట్‌ కలెక్టర్‌గా కేతన్‌గార్గ్‌ జిల్లాలో రెండేళ్ల ఐదు నెలలు జిల్లాలో విధులు నిర్వర్తించారు. 2022, ఫిబ్రవరి 5వ తేదీన ఆయన జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడా విమర్శలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించారు.

టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరద

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయానికి వరద పోటు ఆగడం లేదు. శుక్రవారం 1,08,790 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో శనివారం ఉదయానికి 1,16,040 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగ నది పోటెత్తుతోంది. ఈ క్రమంలో పరుగులు తీస్తూ నీరంతా టీబీ డ్యాం చేరుతోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 105.788 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గానూ 65.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,633 అడుగుల నీటి మట్టానికి గాను 1,621.32 అడుగులకు నీరు చేరింది. ఈ నెల 22 నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు నీరు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీబీ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

జేఎన్‌టీయూ

రిజిస్ట్రార్‌గా కృష్ణయ్య

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ ఎస్‌. కృష్ణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఇన్‌చార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శన రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. రిజిస్ట్రార్‌గా ఎంపిక చేసిన వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. వర్సిటీ పురోగతికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు వర్సిటీ డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కాగా, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకూ జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌గా కృష్ణయ్య పనిచేశారు. ఇటీవల టీడీపీతో కూడిన కూటమి అధికారంలోకి రాగానే రిజిస్ట్రార్‌గా మళ్లీ ఆయననే నియమించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement