రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో ఓ యువకుడు కరెంటు పోలుపై నుంచి కింద పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కందుకూరుకు చెందిన లక్ష్మీనారాయణ ఇంటికి విద్యుత్ పోల్ నుంచి అనుసంధానం చేసిన వైర్ లూజ్ కనెక్షన్ కారణంగా కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గులు ఉంటూ వచ్చింది. ఇదే విషయాన్ని సమీపంలో ఉన్న పుట్టపర్తి లింగమయ్యకు (26) లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం లింగమయ్య కరెంటు పోలు ఎక్కి లక్ష్మీనారాయణ ఇంటికి సంబంధించిన సర్వీస్ వైర్ తాకగానే షాక్ కొట్టింది. దీంతో ఆయన కిందకు పడ్డాడు. తల నేరుగా వెళ్లి రాయిపై పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.