
కమనీయం.. సీతారాముల కల్యాణం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తుల రామనామస్మరణ మధ్య సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు అనంతరం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. ఆలయ ఈఓ వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో స్వామివార్లను, కల్యాణోత్సవ సామగ్రిని, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుముహూర్తాన మాంగల్య ధారణ గావించారు. మహామంగళ హారతితో ఘట్టాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెండు గంటల పాటు సాగిన ఉత్సవంలో భక్తులు రామనామస్మరణ చేస్తూ తన్మయత్వం పొందారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను గజవాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు.
కసాపురంలో వైభవంగా
శ్రీరామనవమి వేడుకలు

కమనీయం.. సీతారాముల కల్యాణం

కమనీయం.. సీతారాముల కల్యాణం

కమనీయం.. సీతారాముల కల్యాణం