
సైనిక లాంఛనాలతో జవాన్‌కు అంత్యక్రియలు
పామిడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్మీ జవాన్ కొండేటి అనిల్‌కుమార్(36)కు సైనిక లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు... పామిడి మండలం ఎదురూరుకు చెందిన అనిల్‌కుమార్ అహమ్మదాబాద్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రమావత్ పార్వతి, 12 ఏళ్ల వయసున్న సాయితేజ, తొమ్మిదేళ్ల వయసున్న మోక్షిత్ అనే కుమారులు ఉన్నారు. పిల్లల చదువుల కోసమని అనంతపురంలో కాపురం పెట్టిన ఆయన గత నెల సెలవుపై ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 19న ద్విచక్ర వాహనంపై వెళుతూ అనంతపురంలోని రుద్రంపేట సమీపంలో స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనం అదుపు తప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి పోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆయన మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం స్వగ్రామం ఎదురూరుకు సైనికులు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో అహమ్మదాబాద్ రెజిమెంట్ అధికారుల సమక్షంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, తహసీల్దార్ ఎన్. శ్రీధరమూర్తి, సీఐ వి.యుగంధర్, మాజీ సైనికోద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.