
జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పయ్యావుల
విడపనకల్లు: జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, మాట్లాడారు. 70 రోజుల్లో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మలోలా, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, ఎల్‌డీఎం నర్సింగరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, సివిల్ సప్లయీస్ డీఎం రమేష్‌రెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు, బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దారు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ షకీలాబేగం, తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీకి జాతీయ స్థాయి సర్టిఫికెట్
రాప్తాడు: స్థానిక పీహెచ్‌సీకి జాతీయ స్థాయి సర్టిఫికెట్ దక్కింది. మంగళవారం అనంతపురంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సర్టిపికెట్‌ను పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.శివకృష్ణ అందుకున్నారు. అలాగే చిన్మయనగర్ ఆయుష్మన్ ఆరోగ్య కేంద్రం కూడా జాతీయ నాణ్యత ప్రమాణాలకు ఎంపిక కావడంతో ఎంఎల్‌హెచ్‌పీ ప్రసన్న, ఏఎంఎం చంద్రకళకు సర్టిఫికెట్లను అందజేశారు.
ఏపీ ఈసెట్‌కు 33 వేల దరఖాస్తులు
అనంతపురం: ఇంజినీరింగ్ కోర్సులో లేటరల్ ఎంట్రీ కింద రెండో సంవత్సరంలోకి అడ్మిషన్లు పొందడానికి నిర్వహించే ఏపీఈసెట్–2025కు మొత్తం 33,454 దరఖాస్తులు అందినట్లు ఈసెట్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్ తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు, రూ.4 వేల అపరాధ రుసుముతో ఈ నెల 24వ తేదీ వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
మాజీ జవాన్ మృతి
గుత్తి: స్థానిక 21వ వార్డులో నివాసముంటున్న మాజీ జవాన్ అల్లాబకాష్ (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆయన తన కాలును పోగొట్టుకున్నారు. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, మాజీ సైనిక ఉద్యోగులు కృష్ణయ్య, రామ్మూర్తి తదితరులు అల్లాబకాష్ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి