
రైతుల సమస్యలు పట్టని బ్యాంక్ అధికారులు
బ్రహ్మసముద్రం : మండలంలోని వేపులపర్తి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ అధికారులకు రైతుల సమస్యలు పట్టడం లేదని మండల వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు గోపాలరెడ్డి, రైతులు మండిపడ్డారు. పంట రుణాల రెన్యువల్‌లో బ్యాంక్ అధికారుల అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం యూనియన్ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీసుకున్న పంట రుణాల రెన్యువల్ జరుగుతున్నాయని జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో రైతుల నుంచి కేవలం వడ్డీ మాత్రమే తీసుకుని రుణాలను రెన్యువల్ చేస్తున్నారని తెలిపారు. అయితే స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారులు మాత్రం రుణం మొత్తం చెల్లించాల్సిందేనంటూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి రైతుల పట్ల నిర్ధయగా వ్యవహరిస్తున్న బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.