సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆయన గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ యూనిఫామ్స్ ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో హార్డ్ వేర్ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నెలకోసారి కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని, ఆ మేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
సేవలు అందించడంలో ఉత్తమ పనితీరు
► ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు, సమర్థత కనబరచాలి. ఇందుకోసం ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరు పట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలి.
► నిర్దేశించిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశం. సేవల కోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఉండాలి. దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందు పరచాలి. ఇందుకు అనుగుణంగా పోర్టల్‌లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేయాలి.
► ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తి కావాలి.
► సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగాలి. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంది.
► సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య నిరంతరం సమన్వయం ఉండాలి. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మే నాటికి సచివాలయాల్లో ఆధార్ సేవలు
Published Fri, Jan 28 2022 4:16 AM | Last Updated on Fri, Jan 28 2022 2:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment