సిబ్బంది తన ప్రైవేట్ భాగాలను ముట్టుకున్నారంటూ ఆందోళన
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
నక్కపల్లి: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అఘోరీ సోమవారం అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కొద్దిసేపు హల్‌చల్ చేశారు. రాజమండ్రి నుంచి విశాఖవైపు వెళ్తున్న అఘోరీ తన కారులో వేంపాడు టోల్‌ప్లాజా వద్దకు వచ్చారు. టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరడంతో తన వద్ద ఫీజు తీసుకోడానికి వీల్లేదని, తాను చెల్లించనంటూ వాగ్వాదానికి దిగారు. ఘర్షణ ఎందుకని ఫీజు తీసుకోకుండానే సిబ్బంది ఆమె కారును విడిచిపెట్టారు .
టోల్‌ప్లాజా దాటి కొద్దిదూరం వెళ్లిన అఘోరీ తిరిగి టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్యాలయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ సిబ్బంది తనపై అనుచితంగా ప్రవర్తించారని, తన ప్రైవేట్ భాగాలను ముట్టుకున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ప్రభుత్వంలో తనలాంటి నాగసాధు మహిళా అఘోరీకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు.
శరీరాన్ని తాకి సారీ చెబుతున్నారని, వీళ్లు అత్యాచారాలు, హత్యలు చేసి కూడా సారీ చెబుతారని ఆక్షేపించారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించారు. ఇంతలో నక్కపల్లి, పాయకరావుపేట పోలీసులు వచ్చి అఘోరీతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజీలు కావాలని ఆమె డిమాండ్ చేయడంతో పోలీసులు టోల్‌ప్లాజా వద్ద అఘోరీకు సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఫుటేజీల్లో కొన్నింటిని చూపించారు.
ఇటీవల తెలంగాణ ప్రాంతంలో వార్తల్లోకెక్కిన ఈ అఘోరీని చూసేందుకు టోల్‌గేట్ పరిసర ప్రాంతాల వారు, జాతీయరహదారిపై రాకపోకలు సాగించేవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపేశారు. అఘోరీ అక్కడ ఉన్నంత సేపు వారు కూడా కదలకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment