చీకటి రాత్రులకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

చీకటి రాత్రులకు బ్రేక్‌

Published Sun, Apr 28 2024 6:16 AM

Andhra govt to provide 9 hrs free power supply to farm lands

ఐదేళ్లుగా ‘కోత’ల్లేవు..కల్లాల్లో పడిగాపులు లేవు 

సేద్యానికి 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌  

రైతన్నకు నమ్మకమిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ పాలన 

6,605 ఫీడర్లలో పగటి పూట వ్యవసాయ విద్యుత్‌.. గతంలో ఉన్నవి కేవలం 3,854 ఫీడర్లే      

పంపుసెట్లకు 30 ఏళ్లు ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ అందించే ఏర్పాటు.. లోపభూయిష్టమైన విద్యుత్‌ సరఫరాకు దిద్దుబాటు  

ఫీడర్ల ఆధునికీకరణకు రూ.1700 కోట్లు కేటాయింపు  

ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలలో రూ.1200 కోట్లతో పనులు వేగవంతం 

రాత్రివేళ విద్యుత్‌ సరఫరాకు స్వస్తి చెప్పిన ప్రభుత్వం

ప్రతి సర్వీసుకీ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌  
విద్యుత్‌ ప్రమాదాలు జరగడానికి, సరఫరా నష్టాలు రావడానికి ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు బలంగా లేకపోవడం, ఓవర్‌ లోడ్‌ కావడమే ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించడానికి కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడంతో పాటు పాత సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెరిగింది. ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న 220కేవీ, 132 కేవీ లైన్లను పాతవి బాగుచేయడంతో పాటు కొత్తవి వేశారు.

డిస్కంల పరిధిలోని 33 కేవీ, 11కేవీ లైన్లు మార్చారు. సబ్‌ స్టేషన్లలో పవర్‌ కెపాసిటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి వ్యవసాయ సర్విసుకీ ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ ఇస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో 19.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ అందుతోంది.  

‘మా ప్రాంతంలో మొత్తం విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వంలో 7 గంటలు విద్యుత్‌ అని ప్రకటించినా అందులో ఒకటి రెండు గంటలపాటు కోతలు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పగటి పూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ అందిస్తున్నారు. దీనివల్ల కూలీలతో పనిచేయించుకొని, చేను మొత్తం తడపడానికి వీలవుతోంది.

గతంతో హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండేవి. దీనివల్ల కొద్దిపాటి గాలికే కలిపిపోయి ట్రాన్స్‌ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడా సమస్య లేదు. గతంలో రోజుకి ఏడు గంటలు రాత్రి సమయాల్లో సేద్యానికి విద్యుత్‌ ఇవ్వడం వల్ల పొలాల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే స్పెల్‌లో ఇవ్వడంతో చేను మొత్తం ఒకేసారి తడుస్తోంది’. – సూర్పని రామకృష్ణ, ఉద్యాన రైతు, కొమ్ముగూడెం 

సాక్షి, అమరావతి: ‘సేద్యానికి విద్యుత్‌ లోటు రాకూడదు. రైతులకు ఇచ్చే విద్యుత్‌కు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దెబ్బతింటే 48 గంటల్లోనే బాగుచేయడం, లేదా కొత్తది ఇవ్వాలి. ఎలాంటి జాప్యం ఉండకూడదు. సర్విసు కూడా అడిగిన వెంటనే మంజూరు చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు’.అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం అక్షర సత్యం చేసింది.

పంటలకు నీటి కొరత లేకుండా చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలను ఆచరణలో పెట్టింది. పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందించేందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ముందుగా వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను ఆధునీకరించి ఉచిత విద్యుత్‌ సరఫరాకు అనుకూలంగా మార్చింది.  

గతమెంతో ‘హీనం’ 
రాష్ట్రంలో వ్యవసాయ ఫీడర్లు ఏడాదికి దాదాపు 15,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగంలో ఉండేవి. ఇది రాష్ట్రంలో ఏడాదికి జరిగే 64 వేల నుంచి 66 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగంలో దాదాపు నాలుగింట ఒక వంతు. జూన్‌ 2019కి ముందు, ఏడు గంటల విద్యుత్‌ సరఫరాకే గ్యారెంటీ ఉండేది కాదు.

అప్పుడు దాదాపు 18 లక్షల వ్యవసాయ సర్విసులకు ఒకేసారి విద్యుత్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయినప్పటికీ వాటికే సరిపెట్టలేక రాత్రి పూట సహా రెండు, మూడు విడతల్లో విద్యుత్‌ అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభు త్వం పగటి పూట విద్యుత్‌ సరఫరా అందిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించి అమలు చేసింది. 

రెట్టింపైన ఫీడర్లు 
టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,663 ఫీడర్లలో కేవలం 3,854 మాత్రమే వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేయడానికి అందుబాటులో ఉండేవి. దానిని మెరుగుపరచడం కోసం చంద్రబాబు ఏమాత్రం దృష్టి సారించలేదు. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ.1,700 కోట్లను కేటాయించింది.

దీంతో ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమ తమ పరిధిలో ఫీడర్ల ఆధునికీకరణ చేపట్టాయి.  రూ.1200.20 కోట్లతో 32 ప్యాకేజీలలో మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాయి. పెరిగిన 6,735 ఫీడర్లలో 6,605 ఫీడర్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయగల సామర్థ్యం వచ్చింది.

Advertisement
Advertisement