సాక్షి, అమరావతి: 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం పార్టీ అనుబంధ విభాగాలు ఎలా పని చేశాయో.. 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించడానికి అదే స్ఫూర్తితో, సమష్టిగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ముందుగా ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు.
అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమన్వయం చేసుకొని త్వరితగతిన పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, మండల ఇన్‌చార్జిల ఖాళీలను భర్తీ చేయాలని చెప్పారు. జయహో బీసీ మహాసభ తరహాలోనే త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, మహాసభలను విజయవంతం అయ్యేలా అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చెయ్యాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు. అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పదవులను త్వరితగతిన భర్తీ చెయ్యడం, జయహో బీసీ మహాసభ మాదిరిగానే రాష్ట్ర స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సమావేశాల నిర్వహణ, వివిధ సామాజిక వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలు ఇంటింటికీ ప్రచారం చేయడం, అనుబంధ విభాగాల అధ్యక్షులకు అదనంగా మరికొందరిని నియమించడంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనుబంధ విభాగాల అధ్యక్షులు, సమావేశంలో పాల్గొన్నవారు ఈ అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment