Skoch Survey 2021: Andhra Pradesh Topped In Star State Status With Welfare Development - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: సుపరిపాలనలో నం.1

Published Thu, Mar 10 2022 3:20 AM | Last Updated on Thu, Mar 10 2022 9:50 AM

Andhra Pradesh once again gets star state status with Welfare development - Sakshi

సాక్షి, అమరావతి: సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ‘స్కోచ్‌’ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వరుసగా రెండో ఏడాదీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ఇంటి ముంగిటకే ఫలాలను చేరవేస్తుండటం వల్లే దేశంలో అన్నింటా ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలుస్తోందని, ‘స్కోచ్‌’ 2021 సర్వే ఫలితాలే అందుకు నిదర్శనమని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ తొలి ఐదు స్థానాల్లో నిలవకపోవడం గమనార్హం. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌(7), మధ్యప్రదేశ్‌ (8), అస్సాం(9), హిమాచల్‌ప్రదేశ్‌ (10), బిహార్‌(11), హరియాణా (12) ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సమగ్రాభివృద్ధికి తీసుకున్న చర్యలపై స్కోచ్‌ సంస్థ ఏటా అధ్యయనం చేస్తోంది. 

సంస్కరణలతో పారదర్శక పాలన..
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి పారదర్శక పాలన అందిస్తున్నారు.  సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. పట్టణ, నగర ప్రాంతాల్లో వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తెచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఏ సమస్యనైనా నిర్దిష్ట కాలపరిమితితో పరిష్కరించేలా సచివాలయాలకు విధి విధానాలను రూపొందించారు. ఫలితంగా అత్యధిక సమస్యలు అక్కడే పరిష్కారమవుతున్నాయి. అర్హులకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లను వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందజేస్తున్నారు. సుపరిపాలన వల్ల అన్ని రంగాల్లోనూ అవినీతికి అడ్డుకట్ట పడింది. స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు ఇవి దోహదం చేశాయి.

గ్రామీణాభివృద్ధిలో మొదటి స్థానం..
సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ సాకారం చేశారు. ప్రతి సచివాలయంలోనూ సగటున పది మంది చొప్పున ఉద్యోగులను నియమించారు. సచివాలయాలకు సొంత భవనాల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, స్వచ్ఛమైన తాగునీరు, అంతర్గత రహదారులు లాంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించారు. గతంలో ఎన్నడూ  లేని రీతిలో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శరవేగంగా సాగుతోందని ‘స్కోచ్‌’ సర్వేలో వెల్లడైంది. దేశంలో గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. 

శాంతి భద్రతల్లో మేటి..
శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉంటేనే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తూ దిశ బిల్లు ద్వారా పిల్లలు, మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. శాంతి భద్రతల విభాగంలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడానికి ఇది దోహదం చేసింది.

జిల్లా పరిపాలనలో మొదటి స్థానం..
పరిపాలన సంస్కరణల ద్వారా జిల్లాల్లో యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కలెక్టర్‌తోపాటు నలుగురు జాయింట్‌ కలెక్టర్లను నియమించారు. దీంతో సంక్షేమాభివృద్ధి పథకాల అమలు శరవేగంగా సాగుతూ ప్రజలకు సత్వరమే ఫలాలు అందుతున్నాయి. జిల్లా పరిపాలన విభాగంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి ఇది బాటలు వేసింది. 

వ్యవసాయంలో అగ్రభాగాన..
వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం మంది ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ వ్యవసాయం, అనుబంధరంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అందజేస్తున్నారు.

వ్యవసాయ సహాయకుడి ద్వారా పంటల సాగులో సలహాలు ఇప్పిస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులను ఆదుకునేందుకు ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీని అందజేసి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. అమూల్‌ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన ధర దక్కేలా చేశారు. ఫలితంగా స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వ్యవసాయంలో అగ్రభాగాన నిలిచింది.

సర్వేలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్‌ రాష్ట్రాలుగా గుర్తించారు. 
స్టార్‌ రాష్ట్రాలు ఇవీ..
ఆంధ్రప్రదేశ్‌ (1) 
పశ్చిమ్‌బంగా (2)
ఒడిశా (3) 
గుజరాత్‌ (4)
మహారాష్ట్ర (5)

సర్వేలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను సత్ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు(పర్‌ఫార్మర్స్‌)గా పేర్కొన్నారు. 
పర్‌ఫార్మర్‌ రాష్ట్రాలు ఇవే.. 
తెలంగాణ (6)
ఉత్తరప్రదేశ్‌ (7)
మధ్యప్రదేశ్‌ (8)
అసోం (9)
హిమాచల్‌ప్రదేశ్‌ (10) 

సర్వేలో 11 నుంచి 15 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు(క్యాచింగ్‌ అప్‌)గా గుర్తించారు. 
క్యాచింగ్‌ అప్‌ రాష్ట్రాలు ఇవే.. 
బిహార్‌ (11)
హర్యానా (12) 
జమ్మూకశ్మీర్‌ (13)
ఛత్తీస్‌గఢ్‌ (14)
రాజస్థాన్‌ (15)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement